భద్రాచలం - చెన్నై బస్సులో ముగ్గురి హత్య...
హైదరాబాద్, జులై 26: భద్రాచలం నుండి చెన్నై వెడుతున్న ఆర్టీసి బస్సులో గురువారం వేకువజామున నెల్లూరు వద్ద నలుగురు వ్యక్తులపై గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేసి వారి గొంతులు కోయడంతో ముగ్గురు మృతి చెందారు. మరణించినవారి శవాలు 12 గంటలకు పైగా బస్సులోనే ఉన్నాయి. గురువారం తెల్లవారు జామున 4 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరగ్గా, సాయంత్రం ఐదు గంటల వరకు కూడా శవాలను బస్సులోంచి తీయలేదు. ఉన్నతాధికారులు వస్తే గానీ ముందుకు కదలబోమని కింది స్థాయి అధికారులు, సిబ్బంది చెప్పారు. ఎస్పీ హైదరాబాదులో ఉండడంతో చాలా ఆలస్యంగా వచ్చారు. బస్సును ఆస్పత్రి వద్దనే ఉంచారు. సైకో సాంబ ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని తొలుత వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను నెల్లూరు జిల్లా ఎస్పీ ఖండించారు. హంతకుడి కోసం వరదాయపాలెం, సత్యవేడు పోలీసులు గాలింపు జరుపుతున్నారు. తమిళనాడు రాష్ట్రంలోని ఊతకోటలో కూడా పోలీసులు అన్వేషణ సాగిస్తున్నారు.
Comments