Tuesday, July 24, 2012

పెరగనున్న డీజిల్, వంట గ్యాస్ ధరలు... ?

న్యూఢిల్లీ, జులై 24:  పెట్రోల్ ధరను లీటర్‌కు 70 పైసలు పెంచిన కేంద్ర ప్రభుత్వం,... డీజిల్ ధరను, గృహ వినియోగం కోసం వాడే వంటగ్యాస్ ధరను పెంచే సూచనలు కనిపిస్తున్నాయి. డీజిల్, వంటగ్యాస్‌ల ధరలనే కాక, కిరోసిన్ ధరను కూడా పెంచాలన్న అంశంపై పూర్తి ఏకాభిప్రాయం వ్యక్తమైందని, హెచ్చింపు ఎప్పుడు? ఎలా? అన్నదే ఇంకా నిర్ణయం కాలేదని కేంద్ర చమురు మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు చెప్పారు. రిటైల్ వాణిజ్యంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐలను) అనుమతించకపోవడం, డీజిల్, వంటగ్యాస్ (ఎల్పీజీ), కిరోసిన్‌లపై సబ్సిడీలకు కోత విధించడం ప్రభుత్వం ఇకపై తీసుకోబోయే ముఖ్యమైన సంస్కరణలని చమురు మంత్రిత్వశాఖ అధికారి  చెప్పారు. డీజిల్, ఎల్పీజీ, కిరోసిన్ ధరలను గత ఏడాది జూన్ 25వ తేదీ తర్వాత ఇప్పటివరకూ పెంచలేదు. ముడిపదార్థమైన చమురు ధరలు పెరిగినా, అంతర్జాతీయ మార్కెట్‌లో రూపాయి మారకం విలువ తగ్గి, దిగుమతుల వ్యయం పెరిగినా, డీజిల్, ఎల్పీజీ, కిరోసిన్ ధరలను మాత్రం ప్రభుత్వం ఇప్పటివరకూ పెంచలేదు. తాజా పరిస్థితులలో లీటర్ డీజిల్‌ను రూ. 11.26 నష్టంతో, గృహ వినియోగానికి సంబంధించిన గ్యాస్ సిలిండర్(14.2 కేజీలు)ను రూ. 319 రూపాయల నష్టంతో విక్రయిస్తున్నామని ప్రభుత్వ రంగంలోని చమురు సంస్థలు చెబుతున్నాయి. కిరోసిన్‌పై తాము లీటర్‌కు రూ. 28.56 దాకా నష్టపోతున్నట్టు ఆ కంపెనీలు పేర్కొంటున్నాయి. ఇప్పుడైనా  దరలు పెంచని పక్షంలో ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంధనం అమ్మకాలపై లక్షా 60 వేల కోట్ల రూపాయలు నష్టపోవలసి వస్తుందని చెబుతున్నారు. ఈ అంశంపై సంబంధిత మంత్రుల సాధికార బృందం ఇంకా ఏర్పాటుకాని ప్రస్తుత పరిస్థితుల్లో, ధరల పెంపు ప్రతిపాదనను కేంద్ర ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ సంఘానికి నివేదించాలని, నిర్ణయాన్ని ప్రధానమంత్రికి వదిలి వేయాలని చమురు మంత్రిత్వశాఖ యోచిస్తున్నట్టు ఆ శాఖ అధికారి చెప్పారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...