Wednesday, July 18, 2012

రాజేష్ ఖన్నా ఇక లేరు...

ముంబై,జులై 18: బాలీవుడ్‌ తొలి సూపర్‌స్టార్‌  రాజేష్‌ఖన్నా(69) కన్నుమూశారు. బాంద్రాలోని తన స్వగృహం "ఆశీర్వాద్‌"లోనే తుదిశ్వాస విడిచారు. ఆయన ఏప్రిల్‌ నుంచి శ్వాససంబంధ సమస్యలతో బాధపడుతున్నారు. గత నెల 23వ తేదీ నుంచి ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందారు. మంగళవారమే వైద్యులు రాజేష్‌ఖన్నాను డిశ్చార్జ్‌ చేశారు. ఆయన మరణవార్త తెలియగానే బాంద్రాలోని ఖన్నా నివాసానికి అభిమానులు భారీగా చేరుకున్నారు. 1942 డిసెంబర్‌ 29లో అమృత్‌సర్‌లో జన్మించిన రాజేష్‌ఖన్నా  అసలు పేరు జతిన్ ఖన్నా. బాలీవుడ్‌లో 163 సినిమాల్లో నటించారు. ఆయన మూడు ఫిలిం ఫేర్‌ అవార్డులను  సొంతం చేసుకున్నారు. 1966లో "ఆఖ్రీ రాత్‌"సినిమాతో కెరీర్‌ను ప్రారంభించిన రాజేష్‌ఖన్నా రాజ్‌, బహారోంకీ సప్నే, ఇత్తెఫాఖ్‌, ఆరాధన వంటి సూపర్‌హిట్‌ సినిమాల్లో నటించి ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించారు.  హాథీ మేరే సాథీ', ‘ఆనంద్', ‘అమర్ ప్రేమ్' వంటి చిత్రాలు ఖన్నా నట జీవితంలో గొప్ప మైలురాళ్లుగా మిగిలిపోతాయి. 1969 నుంచి 1972 మధ్యకాలంలో ఒకదాని తర్వాత మరొకటిగా 15 సూపర్ హిట్ చిత్రాలను అందించిన ఘనత ఆయనకే దక్కుతుంది. ‘ఆరాధన', హాథీ మేరే సాథీ', ‘ఆనంద్', ‘అమర్ ప్రేమ్' వంటి చిత్రాలు ఖన్నా నట జీవితంలో గొప్ప మైలురాళ్లు.  1991 నుంచి 1996 వరకు ఎంపీగా పని చేశారు. నటుడుగానే కాకుండా నిర్మాతగా పలు చిత్రాలు నిర్మించారు. రాజేష్ ఖన్నాను ముద్దుగా  కాకా అంటారు. 1973 లో డింపుల్ కపాడియాను వివాహం చేసుకున్న ఖన్నా 1984లో ఆమె నుంచి విడిపోయాడు. ప్రస్తుతం వీరు విడివిడిగా జీవిస్తున్నప్పటికీ, విడాకులు తీసుకోలేదు. పెద్ద కూతురు ట్వింకిల్ ఖన్నా కొంత కాలం సినిమాల్లో నటించిన అనంతరం బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్‍‌ను పెళ్లాడింది. రెండో కూతురు రింకీ ఖన్నా కూడా ఒకటి రెండు సినిమాల్లో నటించింది. తర్వాత ఆమె లండన్‌లోని ఓ వ్యాపారవేత్తను వివాహం చేసుకొని అక్కడే స్థిరపడింది. ఖన్నాతో విడిపోయినప్పటికీ డింపుల్ కపాడియా కొంత కాలంగా ఆయన వెంటేవుండి సపర్యలు చేస్తున్నారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...