Sunday, July 1, 2012

రాష్ట్రంలో ప్రణబ్ ప్రచారం

    హైదరాబాద్, జులై 1: దేశానికి మరింత గౌరవ ప్రతిష్టలు తెస్తానని, అన్ని పార్టీల సభ్యులు తనకు మద్దతివ్వాలని యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీ కోరారు. రాష్ట్రపతి ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రణబ్ ఆదివారం చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చారు. జూబ్లీహాలులో జరిగిన కాంగ్రెస్ శాసన సభాపక్ష సమావేశంలో ప్రసంగించారు. ‘‘నేను కాంగ్రెస్ నేతగా ఇక్కడికి రాలేదు. రాష్ట్రపతి అభ్యర్థిగా వచ్చాను. ఇప్పుడు నేను ఎన్నికల ప్రచారానికి రాలేదు. ఎలక్టోరల్ సభ్యులను కలవడానికి వచ్చాను. సుదీర్ఘకాలం వివిధ హోదాల్లో దేశానికి సేవలందించిన వ్యక్తిగా దేశ ప్రజలందరికీ నా గురించి తెలుసు. కాంగ్రెస్ నేతగా సుదీర్ఘకాలం నాకు గౌరవం లభించింది. రాష్ట్రపతి అభ్యర్థిగా కాంగ్రెస్ ఒక్కటే కాకుండా యూపీఏలోని దాదాపు అన్ని పార్టీలు నాకు మద్దతిస్తున్నాయి. యూపీఏ బయట ఉన్న సీపీఎం, ఫార్వర్డ్ బ్లాక్, ఎస్పీ, బీఎస్పీలే కాకుండా యూపీఏను వ్యతిరేకించే ఎన్డీయేలోని జేడీ (యూ), శివసేన వంటి పార్టీలూ మద్దతు ప్రకటించాయి. కాంగ్రె స్ నేతనని కాకుండా రాష్ట్రపతి అభ్యర్థిగా నాకు సహకారం అందిస్తున్నాయి. నేను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాదిని కాదు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కూడా నాకు వీడ్కోలు చెప్పింది’’ అని ప్రణబ్ చెప్పారు. ‘‘ప్రజాస్వామ్యంలో రాష్ట్రపతి స్థానానికి ఎవరైనా పోటీ చేయవచ్చని రాజ్యాంగంలో ఉంది. ఆ పదవి గౌరవప్రదమైనది కనుక అందరికీ ఆమోదయోగ్యమైన వారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడమన్నది సంప్రదాయం. సాధారణంగా అధికార పార్టీ ప్రతిపాదించే వారే ఎన్నికవుతుంటారు. ఇతర పార్టీలూ దాదాపు ఆ అభ్యర్థికే మద్దతు ప్రకటిస్తుంటాయి. అప్పుడే ఆ పదవి ఔన్నత్యాన్ని గౌరవించినట్లు అవుతుంది. రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా అన్ని పార్టీలు నాకు మద్దతిస్తాయని ఆకాంక్షిస్తున్నాను’’ అని పేర్కొన్నారు. దక్షిణాది నుంచి అనేకమంది నేతలు రాష్ట్రపతి పదవిని అలంకరించి సేవలందించారని అంటూ.. నీలం సంజీవరెడ్డి, సర్వేపల్లి రాధాకృష్ణన్, వీవీ గిరి, వెంకట్రామన్, అబ్దుల్‌కలాంలను ఆయన గుర్తుచేశారు. వారంతా ఆ పదవికి వన్నె తెచ్చారని, తానూ ఆ పదవి గౌరవాన్ని నిలబెడతానని వివరించారు.  అనంతరం ప్రణబ్ మీడియాతో మాట్లాడుతూ.. ఈనెల 15 వరకు వివిధ రాష్ట్రాల్లో పర్యటించి, అక్కడి ఎలక్టోరల్ కాలేజి సభ్యులను కలుసుకుంటానని చెప్పారు. రాష్ట్రపతి పదవి అనేది పార్టీలకు అతీతమైనదని, ఇప్పుడు తాను పార్టీ, ప్రభుత్వ విధానాలపై మాట్లాడలేనని అన్నారు. ఎంఐఎం సభ్యుల మద్దతు గురించి విలేకరులు ప్రస్తావించగా.. వారు యూపీఏ భాగస్వాములే కనుక తప్పకుండా వారి మద్దతు లభిస్తుందని ప్రణబ్ వ్యాఖ్యానించారు.

 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...