Saturday, July 28, 2012

: ఈ ఏడాది అదనంగా 31,190 ఇంజనీరింగ్‌ సీట్లు...

హైదరాబాద్, జులై 28: ఈ ఏడాది ఇంజనీరింగ్‌లో అదనంగా 31,190 సీట్లకు ఏఐసీటీఈ అనుమతి ఇచ్చింది. దీంతో ఈ సంవత్సరం రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాలల్లో ఉన్న సీట్ల సంఖ్య 3,38,115 కు పెరిగింది. గత ఏడాది 3,06,925 సీట్లు మాత్రమే ఉన్నాయి. ప్రధానంగా ఎలక్ట్రికల్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్‌లో 10,375 సీట్లు పెరిగాయి. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్‌లో 8,220, మెకానికల్ ఇంజనీరింగ్‌లో 9,270 సీట్లు అదనంగా వచ్చాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో 2,880 సీట్లు తగ్గాయి. కౌన్సెలింగ్ ప్రారంభంనాటికి మరిన్ని సీట్లకు ఏఐసీటీఈ అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. కాగా, ఇంజనీరింగ్ వెబ్ కౌన్సెలింగ్ వచ్చే నెల రెండో వారంలో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యయ నివేదికలు సమర్పించని కాలేజీలు ప్రస్తుతం అమలులో ఉన్న ఏ, బీ కేటగిరీలకు వేర్వేరు ఫీజుల విధానానికి అంగీకరిస్తే.. కన్వీనర్ కోటా ఫీజు రూ.4 వేలు పెంచుతామని ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలకు యాజమాన్య సంఘాల ప్రతినిధులు ప్రాథమికంగా అంగీకరించారు. అయితే, ఈ కళాశాలలన్నీ ఏకాభిప్రాయానికి రావడానికి ఒకటి, రెండు రోజులు పట్టే అవకాశముంది. అవి కామన్ ఫీజు అక్కర్లేదని ప్రభుత్వానికి చెబితే, సుప్రీంకోర్టు తీర్పుతో సంబంధం లేకుండా వచ్చే నెల 1వ తేదీన కౌన్సెలింగ్ షెడ్యూలు వెలువడి, 9 నుంచి సర్టిఫికెట్ల పరిశీలన, 12 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభమయ్యే అవకాశముంది. సెప్టెంబర్ 1న తరగతులు ప్రారంభమయ్యే అవకాశముంది. ఒకవేళ ప్రభుత్వ ప్రతిపాదనకు యాజమాన్యాలన్నీ అంగీకరించకపోతే.. ఏ,బీ కేటగిరీల అంశంపై వచ్చేనెల 1వ తేదీన సుప్రీంకోర్టులో జరిగే విచారణ వరకు వేచి చూడాల్సి వస్తుంది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...