Wednesday, July 4, 2012

జగన్ రిమాండ్ 18 వరకు పొడిగింపు

హైదరాబాద్,జులై 4: అక్రమాస్తుల   వ్యవహారంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, బీపీ ఆచార్యల రిమాండ్‌ను సీబీఐ ప్రత్యేక కోర్టు ఈనెల 18 వరకు పొడిగించింది. వీరిద్దరి రిమాండ్ ముగియడంతో బుధవారం చంచల్‌గూడ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి యు.దుర్గాప్రసాదరావు ఎదుట హాజరుపర్చారు. జగతి పబ్లికేషన్స్ తరపున కంపెనీ సెక్రటరీ కార్తీక్ కోర్టు విచారణకు హాజరుకావడంపై సీబీఐ డిప్యూటీ లీగల్ అడ్వైజర్ బళ్లా రవీంద్రనాథ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ కేసులో కార్తీక్ సాక్షిగా ఉన్నారని, ఆయన నిందితునిగా హాజరుకావడమే తమ అభ్యంతరమని చెప్పారు. సీబీఐ అభ్యంతరాన్ని పరిశీలిస్తామని కోర్టు తెలిపింది. వీరి హాజరును నమోదు చేసుకున్న కోర్టు, తదుపరి విచారణను 18వ తేదీకి వాయిదావేసి, ఆరోజున కోర్టుకు హాజరుకావాలని నిందితులను ఆదేశించింది.  మరోవైపు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి బెయిలు కోసం పెట్టుకున్న దరఖాస్తును హైకోర్టు తిరస్కరించింది. దర్యాప్తు కీలక దశలో ఉన్నందున ఆయనకు బెయిలు మంజూరు చేయటం సరికాదంటూ.. జస్టిస్ సముద్రాల గోవిందరాజులు బుధవారం ఈ బెయిలు పిటిషన్‌ను తిరస్కరించారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...