Wednesday, May 2, 2012

‘అతిరాత్రం’ పరిపూర్ణం

భద్రాచలం, మే 2:  ఇక్కడకు సమీపం లోని యెటపాక వద్ద అత్యంత ప్రాచీన వైదిక సంప్రదాయ క్రమానుగతికి అనుగుణంగా పన్నెండురోజులపాటు నిర్విరామంగా సాగిన ఉత్కృష్ట సోమయాగం ‘అతిరాత్రం’ బుధవారం ముగిసింది. లక్షలాది మంది భక్తజనుల సమక్షంలో సాగిన ఈ వైదిక క్రతువు పరమపవిత్రంగా సాగింది. అశ్వినీ స్తోత్రపఠనంతో రుత్వికులు వైదిక తంతును కొనసాగించారు. అనుయాజం వైదిక క్రతువుతో రుత్వికులు యాగ పరిసమాప్తికి వేదమంత్రాలు పఠించారు. హారీయోజనం కార్యక్రమంలో ఉన్నేత అనే రుత్వికునితో చివరిసారి సోమరసాన్ని ఆహుతి చేయించారు. సకల దోషాల పరిహారం కోసం 300 ఆజ్యాహుతులతో మహాప్రాయశ్చిత క్రతువును రుత్వికులు నిర్వహించారు. అవభృతంలో యాగ యజమాని సోమయాజి, ఆయన ధర్మపత్ని సావిత్రి పథినాడికి యాగపరిసమాప్తి స్నానం చేయించారు. అనంతరం ఉదయనీయ ఇష్టి, మైత్రావరుణి పశుఇష్టి నిర్వహించారు. వేదమంత్రాలతో దేవతలను ఆహ్వానించి ప్రత్యేక పూజలు చేశారు. సూర్య, వరుణాది దేవతలకు పశుఇష్టి నిర్వహించారు. సక్తుహోమంలో పేలాల పిండితో హోమాన్ని నిర్వహించారు. భక్తుల జయజయధ్వానాలు.. శ్రీరామ నామస్మరణ.. రుత్వికుల వేదమంత్రాల నడుమ పూర్ణాహుతి శాస్త్రోక్తంగా సాగింది. సాయంత్రం ఏడు గంటల ఐదు నిమిషాలకు మొదలైన అగ్నిసంస్కారం పదినిమిషాల్లో పూర్తయింది. ఈ అగ్ని కీలల వెలుగులో భద్రాచల పరిసర ప్రాంతం దేదీప్యమానంగా వెలిగింది. పూర్ణాహుతిని తిలకించిన భక్తులు పులకించిపోయారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...