Sunday, May 27, 2012

జగన్‌ అరెస్టు : రేపు సీబీఐ కోర్టులో హాజరు

హైదరాబాద్,మే 27: అక్రమాస్తుల కేసులో  అనుకున్నట్టే  జగన్‌ను సి.బి.ఐ. అరెస్టు చేసింది. ఆదివారం నాడు  మూడో రోజు విచారణ అనంతరం  రాత్రి 7.20 గంటలకు జగన్‌ను అరెస్టు చేసినట్లు సీబీఐ ప్రకటించింది. అక్రమాస్తుల కేసులో జగన్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ వెల్లడించారు. జగన్‌పై ఆర్‌సీ 19 (ఏ) నిబంధన ప్రకారం ప్రాథమిక దర్యాప్తు నివేదిక (ఎఫ్ఐఆర్) నమోదు చేయనున్నట్లు చెప్పారు. అలాగే అవినీతి నిరోధక చట్టంలోని 13(1), 13(2)తో పాటు 120 (బీ), రెడ్‌విత్ 420, 409, 477 (ఏ) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. సోమవారం నాడు  జగన్‌ను సీబీఐ కోర్టులో హాజరు పరుస్తామన్నారు. ఈ రాత్రికి జగన్‌ను దిల్‌కుషాలోనే నిర్బంధంలో ఉంచనున్నట్లు స్పష్టం చేశారు.జగన్ అరెస్టు నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా హైఅలెర్ట్ ప్రకటించారు. ముందు జాగ్రత్త చర్యగా పెద్ద సంఖ్యలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అరెస్టు చేశారు. జగన్ అరెస్టు తర్వాత పలు జిల్లాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీ విధ్వంసానికి పాల్పడినట్లు సమాచారం అందింది. విజయవాడలో జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో కార్యకర్తలు పోలీస్ స్టేషన్‌ను ముట్టడించారు. పడమటలో ఒక ఆర్టీసీ బస్సుని ధ్వంసం చేశారు. అనంతపురంలో కార్యకర్తలు రిలయన్స్ టవర్‌కు నిప్పుపెట్టారు. కొన్ని జిల్లాలో రాజీవ్ గాంధీ విగ్రహాలు ధ్వంసం చేసినట్లు తెలిసింది. మరోవైపు జగన్మోహన్‌రెడ్డి అరెస్టును  నిరసిస్తూ    వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సోమవారం రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్హింది.
విజయమ్మ ఆక్రోశం
జగన్ అరెస్టుకు నిరసనగా విజయమ్మ కుటుంబ సభ్యులతో దిల్ కుశ అతిథి గృహం ముందు బైఠాయించారు.జగన్ చేసిన తప్పేంటని  విజయమ్మ ప్రశ్నించారు.  ఓదార్పుయాత్ర చేయడమే జగన్ చేసిన తప్పా, ప్రజలకు ఇచ్చిన మాటపై నిలబడడం కోసం సోనియాను ధిక్కరించడం తప్పా, ప్రజా నాయకుడిగా ఎదగడం జగన్ చేసిన తప్పా అంటూ నిలదీశారు. సీబీఐ ఎందుకు హడావుడిగా జగన్ ను అదుపులోకి తీసుకుందని ప్రశ్నించారు. కాంగ్రెస్ కు వైఎస్సార్ అందించిన సేవలకు ఇదా ప్రతిఫలం అంటూ నిలదీశారు. ఈ పరిణామాలు చూస్తుంటే వైఎస్సార్ మరణంపై కూడా అనుమానాలు కలుగుతున్నాయన్నారు. తన బిడ్డను ఏం చేయదలుచుకున్నారని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, మరెక్కడైనా ఉన్నామా అంటూ వాపోయారు. మహానేత చనిపోయిన నాటి నుంచి నరకం చూపించారన్నారు. వీటన్నింటినీ దేవుడు చూస్తున్నాడన్నారు.

.






No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...