Monday, May 28, 2012

ఓదార్పు కావలెను...

హైదరాబాద్, మే 28: రాష్త్ర వ్యాప్తంగా విస్తృతంగా ఓదార్పు యాత్రలు జరిపిన జగన్ కు ఇప్పుడు ఓదార్పు కావాలి. అక్రమాస్తుల కేసులో సీబీఐ అరెస్టు చేసిన జగన్‌కు నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. జగన్ తరపున దాఖలైన బెయిల్ పిటిషన్‌ను తోసిపుచ్చింది. అలాగే జగన్‌ను కస్టడీకి కోరుతూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. దీనితో జగన్‌ను చంచల్‌గూడ జైలుకి తరలించారు. జగన్ కస్టడీకి సంబంధించి హైకోర్టుని ఆశ్రయించాలని  సీబీఐ నిర్ణయించింది. కాగా, జగన్, విజయసాయి రెడ్డి మినహా తొలి చార్జ్‌షీటలో సీబీఐ పేర్కొన్న పదకొండు మంది నిందితులకు న్యాయస్థానం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే రెండవ చార్జ్‌షీట్‌లోని నిందితుల జాబితాలో సైతం జగన్, విజయసాయి రెడ్డి పేర్లు పొందుపరచడంతో వారికి బెయిలు ఇవ్వజాలమని కోర్టు స్పష్టం చేసింది.
 30 నుంచి విజయమ్మ ఉప ఎన్నికల ప్రచారం
 కొడుకు అరెస్ట్ తో ఓ రోజు నిరాహార దీక్ష చేసిన విజయమ్మ  అతగాడికి జైలు తప్పక పోవడంతో  దీక్ష విరమించి గుండె నిబ్బరం చెసుకుని ఉప ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు. విజయమ్మ ఈ నెల 30 నుంచి ఉప ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారు.  30వ తేది మధ్యాహ్నం నర్సన్నపేట నుంచి ఆమె ప్రచారం ప్రారంభిస్తారు. 30, 31వ తేదీల్లో పాయకరావుపేట నియోజకవర్గంలో పర్యటిస్తారు. 31వ తేదీ సాయంత్రం రామచంద్రాపురం నియోజకర్గంలో పర్యటిస్తారు. జూన్ 1న నర్సాపురం, 2న పోలవరం, 3న పత్తిపాడులో వైఎస్ విజయమ్మ ప్రచారం చేస్తారు. 
 పెట్టుబడుల రూపంలో వచ్చినవన్నీ లంచాలే: సిబిఐ
 వైయస్ జగన్ కంపెనీల్లోకి పెట్టుబడుల రూపంలో వచ్చినవన్నీ లంచాలేనని సిబిఐ పేర్కొంది. వైయస్ జగన్ రిమాండ్ రిపోర్టులో ఆ విషయాన్ని సిబిఐ స్పష్టంగా పేర్కొంది.  వైయస్ జగన్ కంపెనీల్లో లంచాలను పెట్టుబడులుగా పెట్టడానికి దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి పూర్తిగా సహకరించారని సిబిఐ ఆరోపించింది. జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన సంస్థలు వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం నుంచి ప్రయోజనాలు పొందాయని చెప్పింది. జగతి పబ్లికేషన్స్ స్థాపనకు అయ్యే ఖర్చును కూడా జగన్ దాచి పెట్టారని, రెండేళ్లు సాక్షి నష్టాల్లో ఉన్నా భారీగా పెట్టుడులు వచ్చాయని, సాక్షి లాభాల్లో వాటాలను గానీ షేర్లను గానీ వెనక్కి తీసుకునే అవకాశం కల్పించలేదని సిబిఐ తెలిపింది. కోల్‌కత్తా, ముంబైలకు చెందిన బ్రీఫ్ కేసు కంపెనీల నుంచి జగన్ సంస్థల్లోకి వంద కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని, అవి ఎక్కుడున్నాయో కూడా కూడా తెలియదని సిబిఐ తెలిపింది. జగన్ విదేశాలకు డబ్బులు తరలించి, అక్కడి నుంచి సండూర్ పవర్ కంపెనీలోకి మళ్లించి, దాని ద్వారా జగతిలోకి పెట్టుబడులను మళ్లించారని ఆరోపించింది. మారిషిస్‌కు చెందిన రెండు కంపెనీల నుంచి 120 కోట్ల రూపాయలు జగన్ కంపెనీల్లోకి వచ్చాయని చెప్పింది. దాల్మియా, పెన్నా సిమెంట్స్, ఇండియా సిమెంట్స్, తదితర సంస్థల వ్యవహారాలను సిబిఐ రిమాండ్ రిపోర్టులో స్పష్టంగా తెలిపింది. ఇండియా సిమెంట్స్ జగతిలో 40 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టిందని చెప్పింది. దాల్మియా సిమెంట్స్ 90 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టిందని తెలిపింది. అందుకు ఆ కంపెనీలు వైయస్ ప్రభుత్వం నుంచి పొందిన ప్రతిఫలాలను కూడా సిబిఐ వివరించింది. ఈ వివరాలన్నీ రాబట్టాల్సి ఉందని సిబిఐ తెలిపింది. జగన్ కంపెనీల్లోకి పెట్టుబడులు వచ్చిన తీరుపై జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయసాయి రెడ్డికి పూర్తిగా తెలుసునని సిబిఐ తెలిపింది. పెట్టుబడిదారులను జగన్ మోసం చేశారని సిబిఐ ఆరోపించింది. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...