Thursday, May 24, 2012

జగన్ ఆస్తుల కేసులో మంత్రి మోపిదేవి అరెస్ట్

హైదరాబాద్, మే 24: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ అస్తుల కేసులో ఆబ్కారీ మంత్రి మోపిదేవి వెంకటరమణను సిబిఐ అధికారులు అరెస్టు చేశారు.  వాన్‌పిక్ భూముల కేటాయింపులో ఆయన అరెస్టయ్యారు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల మంత్రిగా పనిచేసిన మోపిదేవి వాన్‌పిక్ భూముల కేటాయింపులో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి.  నిమ్మగడ్డ ప్రసాద్, బ్రహ్మానంద రెడ్డిలతో కలిపి గంటన్నర పాటు విచారించిన తర్వాత మోపిదేవిని సిబిఐ అరెస్టు చేసింది. మోపిదేవి వెంకటరమణ ఇష్టానుసారం జీవోలు జారీ చేశారని, నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని సిబిఐ ఆరోపిస్తోంది.  బుధవారం  ఏడు గంటల పాటు మోపిదేవిని ప్రశ్నించిన సీబీఐ అధికారులు గురువారం కూడ్ కూఆడా విచారణ జరిపిన అనంతరం  అదుపులోకి తీసుకున్నారు. కాగా, అరెస్టయిన నేపథ్యంలో  మోపిదేవి తన మంత్రి పదవికి రాజీనామా చశారు.
ఇతర మంత్రుల్లో గుబులు...
జగన్ ఆస్తుల కేసులో ఆబ్కారీ మంత్రి మోపిదేవి వెంకటరమణ అరెస్టు కావడంతో సుప్రీంకోర్టు నోటీసులు అందుకున్న ఇతర మంత్రుల్లో గుబులు ప్రారంభమైంది. ఆరుగురు మంత్రులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. వైయస్ జగన్ ఆస్తుల కేసులో అరెస్టయిన తొలి మంత్రి మోపిదేవి వెంకటరమణ. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో జారీ చేసిన 26 వివాదాస్పద జీవోలపై సుప్రీంకోర్టు ఆరుగురు మంత్రులకు నోటీసులు జారీ చేసింది. వీరిలో మోపిదేవితో పాటు  గీతారెడ్డి, సబితా ఇంద్రా రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, ధర్మాన ప్రసాద రావు, కన్నా లక్ష్మినారాయణ ఉన్నారు. సబితా ఇంద్రా రెడ్డిని సిబిఐ అధికారులు ఇప్పటికే రెండు సార్లు ప్రశ్నించారు. గీతా రెడ్డికి, పొన్నాల లక్ష్మయ్యకు సిబిఐ నోటీసులు జారీ చేసినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. కానీ తమకు నోటీసులు రాలేదని వారిద్దరు చెప్పారు. సిబిఐ అడిగే ప్రశ్నలకు తాను సమాధానం చెప్తానని, పిలిస్తే సిబిఐ విచారణకు హాజరవుతానని పొన్నాల లక్ష్మయ్య చెప్పారు. వైయస్ రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో సబితా ఇంద్రా రెడ్డి గనుల శాఖను, గీతా రెడ్డి భారీ పరిశ్రమల శాఖను నిర్వహించారు. మోపిదేవి వెంకటరమణ అరెస్టుతో మంత్రివర్గంలో కలకలం ప్రారంభమైంది. మంత్రివర్గ సభ్యులను ఎందుకు వదిలేస్తున్నారంటూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు, ఐఎఎస్ అధికారులు వేసిన ప్రశ్నకు మోపిదేవి అరెస్టు ద్వారా సిబిఐ సమాధానం చెప్పినట్లయింది. మంత్రుల అరెస్టు మోపిదేవి అరెస్టుతో ఆగిపోయే పరిస్థితి లేదని అంటున్నారు.


No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...