Sunday, May 6, 2012

ఎన్‌సీటీసీ కి కాంగ్రెసేతర ముఖ్యమంత్రుల ససేమిరా...

న్యూఢిల్లీ,మే 6:  యూపీఏ ప్రభుత్వం ప్రతిపాదించిన జాతీయ ఉగ్రవాద నిరోధక కేంద్రం (ఎన్‌సీటీసీ) ను  కాంగ్రెసేతర ముఖ్యమంత్రులు నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. దీనిపై నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించే లక్ష్యంతో కేంద్రం శనివారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రుల సమావేశంలో  ఏకాభిప్రాయం కుదర లేదు.  దేశ భద్రత, రక్షణ కోసం ఎన్‌సీటీసీ అవసరమని, దీనిపై ఏకాభిప్రాయానికి రావాలని ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్, కేంద్ర హోంమంత్రి పి.చిదంబరం చేసిన విజ్ఞప్తులు ప్రభావం చూపలేకపోయాయి. కాంగ్రెస్ మిత్రపక్షాలతోపాటు, ఇతర పక్షాలకు చెందిన ముఖ్యమంత్రులను ఎన్‌సీటీసీ ఏర్పాటుకు ఒప్పించటంలో యూపీఏ సర్కారు విఫలమైంది. మొత్తం 24 మంది ముఖ్యమంత్రులు, ముగ్గురు రాష్ట్ర మంత్రులు హాజరైన ఈ సమావేశంలో.. దాదాపు డజను మంది కాంగ్రెసేతర సీఎంలు ఎన్‌సీటీసీ ప్రతిపాదనను వ్యతిరేకించారు.  యూపీఏ కీలక భాగస్వామి అయిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ, బీజేపీ నాయకుడు, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీలయితే.. అసలు ఎన్‌సీటీసీ ప్రతిపాదననే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ మిత్రపక్షమైన నేషనల్ కాన్ఫరెన్స్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా ఎన్‌సీటీసీ ప్రస్తుత రూపంపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఇది కూడా సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టంలాగే వివాదాస్పదమవుతుందని అభిప్రాయపడ్డారు. యూపీఏ ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతిస్తున్న సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్‌యాదవ్ కూడా.. ఎన్‌సీటీసీ నిబంధనలను దుర్వినియోగం చేసే అవకాశం ఉందని, కాబట్టి ప్రస్తుత రూపంలో దానిని అంగీకరించలేమని పేర్కొన్నారు. అయితే బీజేపీ నాయకుడు, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్.. తమ సూచనలను పొందుపర్చుతూ ఎన్‌సీటీసీకి సవరణ చేసినట్లయితే.. దానికి తాము మద్దతిస్తామన్నారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...