Tuesday, May 8, 2012

హజ్‌ సబ్సిడీరద్దుకు సుప్రీం ఆదేశం...

న్యూఢిల్లీ, మే 8: హజ్‌యాత్రకు వెళ్లే యాత్రికులకు ఇస్తున్న సబ్సిడీని ఎత్తివేయాలని సుప్రీంకోర్టు  ఆదేశించింది. హజ్ యాత్రకు రాయితీ కల్పిస్తున్న ప్రభుత్వం విధానాన్ని న్యాయస్థానం రద్దుచేసింది. అలాగే పదేళ్లలోగా ఈ రద్దు ప్రక్రియను పూర్తిచేయాలని జస్టిస్ అల్టమస్ కబీర్, రంజన ప్రకాష్‌దేశాయ్‌తో కూడిన బెంచ్ కేంద్రాన్ని ఆదేశించింది. హజ్ యాత్రకు కేంద్ర ప్రభుత్వం తరఫున వెళ్లే బృందంలో సభ్యుల సంఖ్యను రెండుకు పరిమితం చేయాలని సూచించింది. ఇప్పటివరకు ఈబృందంలో 30వరకు సభ్యులు మక్కా వెళుతున్నారు. భారత్ హజ్ కమిటీ పనిచేసే విధానం.. హజ్ వెళ్లే యాత్రికుల ఎంపిక ప్రక్రియను పరిశీలించనున్నట్లు బెంచ్ పేర్కొంది. ప్రభుత్వం తరఫున సబ్సిడీతో వెళ్లే 1100 మందిలో 800 మంది యాత్రికుల బాధ్యతల నిర్వహణకు కొందరు ప్రైవేట్ ఆపరేటర్లను అనుమతించాలని విదేశాంగ శాఖను ఆదేశిస్తూ బొంబై హైకోర్టు ఇచ్చిన తీర్పును కేంద్రం సుప్రీంకోర్టులో సవాలుచేసింది.ఈ అప్పీల్‌పై విస్తృత పరిధిలో విచారణ జరిపిన బెంచ్, హజ్ యాత్రికులకు సబ్సిడీ ఇచ్చే ప్రభుత్వ విధానంలో న్యాయబద్ధతను పరిశీలించాలని నిర్ణయించింది. కేసు విచారణలో హజ్ యాత్రికులకు సబ్సిడీ ఇస్తున్న విధానాన్ని ప్రభుత్వం సమర్థించుకుంది. యాత్రికుడు తన జీవితకాలంలో ఒకసారి హజ్‌యాత్రకు సబ్సిడీపై అనుమతించాలన్న మర్గాదర్శకాలు రూపొందించినట్లు కోర్టుకు తెలిపింది. అలాగే హజ్ వెళ్లే ముస్లిం యాత్రికులకు జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే సబ్సిడీ కల్పించాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం తన అఫిడవిట్‌లో వివరించింది. ప్రస్తుతం ప్రతి ఐదేళ్లకోసారి సబ్సిడీపై హజ్‌యాత్రకు అనుమతిస్తున్నారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...