విధ్యార్థిపై రాందేవ్ అనుచరుల వీరంగం
భోపాల్,మే 7: మధ్యప్రదేశ్‌లోని భిండ్ పట్టణంలో యోగా గురువు బాబా రామ్‌దేవ్ మద్దతుదారులు కొందరు ఒక విద్యార్థిపై దాడి చేశారు. ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో గత ఏడాది దీక్ష కొనసాగిస్తుండగా, పోలీసులు దాడి చేసినప్పుడు ఆడవేషంలో ఎందుకు పారిపోయేందుకు ప్రయత్నించారంటూ బాబా రామ్‌దేవ్‌ను ప్రశ్నించడమే తడవుగా ఆగ్రహంతో ఊగిపోయిన రామ్‌దేవ్ మద్దతుదారులు మూకుమ్మడిగా అతడిపైకి లంఘించి చితకబాదారు. బాధిత విద్యార్థిని అశుతోష్ పరిహార్‌గా గుర్తించారు. భిండ్‌లోని రాజీవ్‌గాంధీ స్టేడియంలో ఆదివారం ఏర్పాటైన యోగా శిబిరం ముగింపు కార్యక్రమంలో ఈ సంఘటన జరిగింది. అనుచరులు చుట్టిముట్టి ఉండగా ఆడవేషంలో రామ్ లీలా మైదానం నుంచి పారిపోయిన విషయంపై అశుతోష్ పరిహార్ రామ్‌దేవ్‌కు ప్రశ్న వేశాడు. ప్రశ్నలు వేయడం ఆపాలాని పరిహార్‌కు బాబా రామ్‌దేవ్ చెబుతుండగానే అనుచరులు అతన్ని పట్టుకుని కొట్టారు. శాంతిని భంగపరిచాడనే ఆరోపణపై పోలీసులు పరిహార్‌ను అదుపులోకి తీసుకున్నారు. పరిహార్‌పై ఏ విధమైన క్రిమినల్ కేసు నమోదు చేయలేదు. వ్యక్తిగత పూచీకత్తుపై అతన్ని పోలీసులు విడుదల చేశారు. ప్రీ మెడికల్ టెస్టుకు సిద్ధమవుతున్న పరిహార్ ఆ విషయాన్ని పోలీసులకు చెప్పలేదు. పరిహార్ శాంతిని భంగపరుస్తాడేమోనని, అనుచరులు అతన్ని చితకబాదుతారేమోనని కస్టడీలోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Comments