తీహార్ జైలు నుంచి రాజా విడుదల

న్యూఢిల్లీ,మే 15: : 2జీ స్పెక్ట్రమ్  కేసులో నిందితుడిగా ఉన్న కేంద్ర టెలికం మాజీ మంత్రి ఎ. రాజా తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. పాటియాల కోర్టు మంగళవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో ఆయన జైలు నుంచి బయట పడ్డారు. 15 నెలల పాటు ఆయన జైలు జీవితం గడిపారు. కోర్టు అనుమతి లేకుండా ఢిల్లీ విడిచి వెళ్లరాదని న్యాయస్థానం రాజాను ఆదేశించింది. బెయిల్ మంజూరు ఆదేశాలు రావడానికి గంట ముందు కోర్టులో రాజా డిఎంకె నాయకురాలు, కరుణానిధి కూతురు కనిమొళి‌తో జోక్ చేస్తూ మాట్లాడడం కనిపించారు. కనిమొళి కూడా ఈ కేసులో జైలులో ఆరు నెలల పాటు ఉన్నారు. ఆమెకు 2011 నవంబర్‌లో బెయిల్ మంజూరైంది.కనిమొళిలతో పాటు 12 మంది నిందితులకు 2జి స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో బెయిల్ మంజూరైంది. రాజా మాత్రమే ఇప్పటి వరకు జైలులో ఉన్నారు. అర్హత లేని సంస్థలకు తక్కువ ధరలకు లైసెన్సులు మంజూరు చేశారని రాజాపై ఆరోపణలున్నాయి. తాను నిర్దోషినని ఆయన కోర్టులో చెప్పుకున్నారు. తాను 2008లో విధానాన్ని అమలు చేసిన విషయం ప్రధాని మన్మోహన్ సింగ్‌కు, అప్పటి ఆర్థిక శాఖ మంత్రి పి. చిదంబరానికి కూడా తెలుసునని ఆయన వాదించారు. రాజా 2008లో ఇచ్చిన 122 మొబైల్ నెట్‌వర్క్ లైసెన్సులను సుప్రీంకోర్టు ఈ ఏడాది ప్రారంభంలో రద్దు చేసింది. ముందు వచ్చినవారికి ముందు విధానాన్ని పాటించడం వల్ల రాజా తనకు నచ్చిన కంపెనీలకు లైసెన్సులు ఇవ్వడానికి ఉపయోగించుకున్నారని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.  

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు