Sunday, May 13, 2012

కర్ణాటకలో మళ్లీ రాజకీయ సంక్షోభం

బెంగళూరు,మే 12:   కర్ణాటకలో మళ్లీ రాజకీయ సంక్షోభం తలెత్తింది. రాష్ట్ర అధికార బి.జె.పి.లో నాయకత్వంపై మరో తిరుగుబాటు మొదలైంది. మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప అనుచరులైన ఏడుగురు మంత్రులు, ఆరుగురు ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతుగా పదవీ త్యాగాలకు సిద్ధపడ్డారు. తమ రాజీనామా లేఖలను  వారు యడ్యూరప్పకే అప్పగించారు. కొందరు మంత్రులు సహా పలువురు నేతలు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ముఖ్యమంత్రి సదానంద గౌడ ఇటీవల పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కారీకి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో నాయకత్వ మార్పు కోసం అధిష్టానంపై ఒత్తిడి తెచ్చేందుకు పదవులు వదులుకోవాలని నిర్ణయించుకున్నట్లు యడ్యూరప్ప వర్గం నేతలు తెలిపారు.  తమ రాజీనామాలపై తమ నాయకుడే నిర్ణయం తీసుకుంటారని వారు  చెప్పారు. తాము ఏమీ చేయకున్నా, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు తమపై ఆరోపణలు వచ్చాయని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. మరోవైపు కొందరు మంత్రులు సహా 38 మంది ఎమ్మెల్యేలు అత్యవసర శాసనసభాపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలంటూ ముఖ్యమంత్రి సదానంద గౌడకు లేఖలు రాశారు. ఇదిలా ఉండగా, అక్రమ మైనింగ్ కేసులో యడ్యూరప్పపై సీబీఐ దర్యాప్తుకు సుప్రీంకోర్టు ఆదేశించడంతో, ఆయన తన మద్దతుదారులతో మంతనాలు ప్రారంభించారు. ఇదే సమయంలో ఆయన మద్దతుదారులైన మంత్రులు, ఎమ్మెల్యేలు రాజీనామాకు సిద్ధపడటం బీజేపీ వర్గాల్లో కలకలం రేపింది. కర్ణాటక హైకోర్టు యడ్యూరప్పపై అక్రమ మైనింగ్ కేసును కొద్దినెలల కిందట కొట్టివేసినప్పటి నుంచి ముఖ్యమంత్రి పదవిని తిరిగి సాధించుకునేందుకు ఆయన తన శైలిలో ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే, తొలుత అవినీతి ఆరోపణల నుంచి బయటపడాలని పార్టీ నాయకత్వం ఆయనకు స్పష్టం చేసింది. ఈలోగా, సదానంద గౌడను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించడమే లక్ష్యంగా యడ్యూరప్ప పావులు కదుపుతున్నారు. కాగా, కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన విషయం తనకు తెలియదని ముఖ్యమంత్రి సదానంద గౌడ చెప్పారు. మం ఇంతవరకు తనకు ఎవరి నుంచి రాజీనామా లేఖలు అందలేదని చెప్పారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...