ఆస్తుల కేసులో జగన్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు..

జగన్ మీడియా సంస్థల బ్యాంక్ ఖాతాల స్తంభన 
హైదరాబాద్,మే 8: : వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు  జగన్ . ఆస్తుల కేసులో ఈ నెల 28వ తేదీన తమ ముందు హాజరు కావాలని కోర్టు వైయస్ జగన్‌కు సమన్లు జారీ కాగా, తాజాగా మంగళవారం సిబిఐ జగన్ మీడియా సంస్థలకు చెందిన బ్యాంక్ ఖాతాల లావాదేవీలను నిలిపేసింది. సాక్షి దినపత్రికను ప్రచురించే జగతి పబ్లికేషన్స్, సాక్షి టెలివిజన్‌ను నడిపే ఇందిరా టెలివిజన్, జననీ ఇన్‌ఫ్రా బ్యాంకు ఖాతాలను సిబిఐ స్తంభింపజేసింది. సిఆర్‌పిసి 102 సెక్షన్ కింద సంక్రమించిన అధికారాలతో సిబిఐ ఆ ఖాతాలను స్తంభింపజేసింది. కొత్త ఖాతాలను తెరిచి, కార్యకలాపాలను నిర్వహించుకోవచ్చునని ఆ సంస్థలకు తెలిపింది.  జగన్ ఆస్తుల కేసులో సిబిఐ చాలా వేగంగా ముందుకు కదులుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఉప ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైయస్ జగన్‌ను సిబిఐ దర్యాప్తు కష్టాలు ముట్టడిస్తున్నాయి. కోర్టు జగన్‌కు సమన్లు జారీ చేయడం, మీడియా సంస్థల ఖాతాలను స్తంభింపజేయడం వంటి పరిణామాల నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో ఆందోళన చోటు చేసుకుంది. జగన్ ఆస్తుల జప్తునకు సిబిఐ కోర్టు నుంచి అనుమతి పొందేందుకు కూడా రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు చెబుతున్నారు.ఈ నెల 28వ తేదీన వైయస్ జగన్‌ను అరెస్టు చేస్తారనేఅనుమానాలు కూడా వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో వ్యక్తమవుతున్నాయి.  ఆ రోజు జగన్ గానీ, ఆయన తరఫు న్యాయవాదులు గానీ కోర్టుకు హాజరు కాకపోతే, కోర్టు జగన్ అరెస్టుకు వారంట్ జారీ అవకాశాలు కూడా లేకపోలేదని న్యాయనిపుణులు అంటున్నారు. ప్రస్తుతం ఉప ఎన్నికల ప్రచారంలో వైయస్ జగన్ తీరిక లేకుండా తిరుగుతున్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం కనేకల్‌లో ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్న జగన్ ఖాతాల స్తంభనపై స్పందిస్తూ, ఖాతాలను నిలిపివేయడాన్ని ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనని ఆయన అన్నారు.   తనను ఎదుర్కోలేకనే ఇటువంటి కుట్రలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. ప్రజల ఆశీస్సులు ఉన్నంత వరకు తనను ఎవరూ ఏమీ చేయలేరని ఆయన అన్నారు.








Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు