ధరల పెరుగుదలా కారణమే: సోనియా
న్యూఢిల్లీ,మార్చి 7: ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తామని యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ తెలిపారు. దేశంలో జరిగే ప్రతి ఎన్నికలు తమకొక గుణపాఠమేనని, ఎన్నికల ఫలితాల నుంచి పాఠాలు నేర్చుకుంటామని అన్నారు. యూపీలో ఆయా ప్రాంతాల్లో అభ్యర్థుల ఎంపిక లో పొరపాట్లు జరిగాయని, ధరల పెరుగుదల కూడా ఓటమికి కారణంగా సోనియా పేర్కొన్నారు. యూపీలో పార్టీ మూలాలు బలంగా లేకపోవడం, కింది స్థాయి నుంచి పార్టీ పటిష్టంగా లేకపోవడమే పార్టీ ఓటమికి కారణమని సోనియా గాంధీ అన్నారు. ఉత్తరప్రదేశ్‌లో బీఎస్పీ పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు కాబట్టే సమాజ్‌వాది పార్టీకి పట్టం కట్టారని సోనియా పేర్కొన్నారు. ఈ ఫలితాలు యూపీఏ ప్రభుత్వంపై ప్రభావం చూపవని, ప్రధానమంత్రిని మార్చే ప్రసక్తే లేదని సోనియా స్పష్టం చేశారు. ఉత్తరాఖాండ్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. గోవాలో ప్రభుత్వ వ్యతిరేకత వల్లే ఓడిపోయామన్నారు. పంజాబ్‌లో తిరుగుబాటు అభ్యర్థులు దెబ్బ తీశారని, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలడం వల్ల తాము గెలవలేకపోయామని ఆమె అన్నారు. అవినీతిపై తీవ్రంగా పోరాడింది కాంగ్రెసు పార్టీయేనని ఆమె చెప్పారు.

Comments