Monday, March 26, 2012

రామచంద్రయ్య సంచలన వ్యాఖ్యలు

తిరుపతి, మార్చి 25:  ‘‘రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రమాదకర పరిస్థితిలో ఉంది.. దీన్ని బాగుచేసే దిశగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కానీ, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కానీ ఆలోచించటం లేదు. ప్రజారాజ్యం పార్టీ కేడర్ తాము కాంగ్రెస్‌లో ఎందుకు విలీనమయ్యామా? అని బాధపడుతున్నారు. పరిస్థితి ఇదేవిధంగా కొనసాగితే కాంగ్రెస్ మరింత దిగజారుతుంది. అప్పుడు చిరంజీవిని కూడా నిందించే అవకాశం ఉండదు’’ అని రాష్ట్ర దేవాదాయ మంత్రి సి.రామచంద్రయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన సందర్భంగా ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ చేసిస సూచనలు, ఆదేశాలు రాష్ట్రంలో అమలు కావటం లేదని ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన చిరంజీవికి.. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం తిరుపతిలో ఆదివారం సాయంత్రం వీడ్కోలు సభ జరిగింది. చిరంజీవితో పాటు మంత్రి సి.రామచంద్రయ్య కూడా పాల్గొన్నారు. అనంతరం రాత్రి 9 గంటల సమయంలో తాను బస చేసిన పద్మావతి అతిథి గృహానికి ఒక టీవీ చానల్‌ను పిలిపించుకుని సీఆర్ మాట్లాడారు. ''' ఏ నాయకుడైనా గుర్తింపు కోసం, పదవుల కోసమే రాజకీయాల్లోకి వస్తారు. సేవ చేయటానికే అయితే లయన్స్ క్లబ్ లాంటి సంస్థలు చాలా ఉన్నాయి. కేవలం చిరంజీవికో, రామచంద్రయ్యకో, గంటా శ్రీనివాసరావుకో పదవులు ఇచ్చినంత మాత్రాన పీఆర్పీ మొత్తాన్ని సంతృప్తి పరచినట్లు కాదు. అలాగని అందరికీ పదవులు ఇవ్వటం సాధ్యం కాదు. అయితే నియోజకవర్గాల్లో మా వారికి పనులు జరగాలి. వారికి తగిన స్థాయిలో గుర్తింపు ఇవ్వాలి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దీని గురించి పట్టించుకోవటం లేదు. ఇంకా మా వారిని పరాయి వారిగానే చూస్తున్నారు. సమస్యల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ మా వారిని నిర్లక్ష్యం చేస్తే ఎలా బలోపేతం అవుతుంది? కేబినెట్ మంత్రిగా నేను కొన్ని విషయాలు బయటకు చెప్పలేను. సీఎం, పీసీసీ అధ్యక్షుడి స్థాయిలో కూడా పీఆర్పీ విలీనం లక్ష్యాన్ని చేరుకునే ప్రయత్నాలు జరగటం లేదు. అందుకే మా ఎమ్మెల్యేలు, నాయకులు వేరే పార్టీల వైపు చూస్తున్నారు. కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో ఈ వలసలు ప్రారంభమయ్యాయి. కాంగ్రెస్ పెద్దలు దీన్ని గుర్తించి మా వారిని ఆదరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా జరిగే అవకాశం ఉంది. మా బాధలు మేం ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావటం లేదు.
రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు ఒకరినొకరు కొట్టుకుంటున్నారు. అందుకే మేం ప్రతి చిన్న విషయానికీ హైకమాండ్‌తో మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ పెద్దలకు రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయాలనే ఆలోచన ఉందా? అనే అనుమానం కలుగుతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే కాంగ్రెస్‌కు జరగబోయే నష్టానికి చిరంజీవిని నిందించే అవకాశం ఉండదు. నేను చిరంజీవికి ఈ విషయం చెప్పాను. చిరంజీవి కూడా ప్రతిసారీ మా నాయకులను బుజ్జగించి ఊరకే ఉంచటం ఎందుకు చేస్తారు? పార్టీలో అసంతృప్తి ఎక్కువయ్యే కొద్దీ కేడర్ ఇతర పార్టీల్లోకి జారుకుంటుంది.’’ అని అన్నారు.
కాంగ్రెస్‌లో కలకలం
చిరంజీవికి అత్యంత సన్నిహితుడు, పీఆర్పీని కాంగ్రెస్‌లో విలీనం చేసే రాజకీయం నడిపిన వారిలో ముఖ్యుడైన సి.రామచంద్రయ్య.. కాంగ్రెస్ పరిస్థితి గురించి, ఆ పార్టీ నాయకుల గురించి, పీఆర్పీ ఎమ్మెల్యేల గురించి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో కలకలం రేపుతున్నాయి. చిరంజీవికి తెలియకుండానే ఆయనీ మాటలు మాట్లాడి ఉండరని ఉభయ పార్టీల శ్రేణులు భావిస్తున్నాయి. కాంగ్రెస్ తరఫున రాజ్యసభకు ఎన్నికైన చిరంజీవి.. అందుకు కృతజ్ఞతలు తెలపటం కోసం శనివారం ఢిల్లీలో సోనియాగాంధీని కలిసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా.. అంతకు ముందు హామీ ఇచ్చినట్లు చిరంజీవికి కేంద్రంలో కేబినెట్ మంత్రి పదవి కాకుండా, సహాయ మంత్రి పదవి ఇస్తామని సోనియా కోటరీ ఆయనకు తెలిపారని సమాచారం. యూపీఏ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నందున అది కూడా ఇప్పటికిప్పుడు ఇచ్చే పరిస్థితి లేదని సోనియాకు అత్యంత సన్నిహితులైన ఏఐసీసీ నేతలు చిరంజీవికి కుండబద్దలు కొట్టినట్లు తెలిసింది. విలీన సమయంలో ఒక మాట, ఆ తర్వాత మరో మాట మాట్లాడుతున్న కాంగ్రెస్ పెద్దల వైఖరిపై చిరంజీవి తీవ్ర అసంతృప్తితో ఉన్నారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...