Sunday, August 7, 2011

చిదంబరంపై కె.సి.ఆర్. చిర్రుబుర్రులు...

 హైదరాబాద్,,అగస్ట్ 7:   ‘‘మీ నెత్తిన మీరే చెయ్యి పెట్టుకొమ్మనే విధంగా చిదంబరమనే సన్నాసి దిక్కుమాలిన మాటలు మాట్లాడుతాడనుకోలేదు. సమస్యను రాష్ట్రంలోనే పరిష్కరించుకుంటే దేశానికి ప్రభుత్వం ఎందుకు? హోంమంత్రి ఎందుకు? రాజ్యాంగమెందుకు? చావటానికా? మైనారిటీ ప్రజలను మెజారిటీ ప్రజలు దోపిడీ చేయకుండా, అణచివేయకుండా ఉండాలనే రాష్ట్రాల విభజన అధికారాన్ని రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ద్వారా కేంద్ర ప్రభుత్వానికి డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కట్టబెట్టారు. తగిన సమయంలో నిర్ణయమంటూ కాలయాపన చేస్తే.. చిదంబరానికే పవరు, పదవి పోతాయి. పొట్టోని నెత్తి పొడుగోడు కొడితే పొడుగోని నెత్తి పోషమ్మ కొడుతది. చిదంబరం ఎక్కడకి పోతాడు? ఇప్పుడు కాకుంటే 2014లో దొరకడా?’’ అంటూ కేంద్ర హోంమంత్రిపై తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు నిప్పులు చెరిగారు.  ‘‘సమస్య వచ్చిందని పోతే.. దానిని మీరే పరిష్కరించుకోవాలంటే.. పెద్ద మనిషి ఎందుకు? పెద్దరికం ఎందుకు?’’ అని విమర్శించారు. ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా శనివారం పార్టీ కార్యాలయంలో ఆయన విగ్రహాన్ని కేసీఆర్ ఆవిష్కరించారు. జయశంకర్ జయంతి సభలోనూ, అనంతరం ‘పోరు తెలంగాణ’ సీడీ ఆవిష్కరణ కార్యక్రమంలోనూ కేసీఆర్ మాట్లాడారు. ‘‘విడిపోవడానికి ఏకాభిప్రాయం ఎందుకు? కలిసి ఉండటానికి ఏకాభిప్రాయం కావాలి. చిదంబరానిది ఏ సిద్ధాంతమో, ఏం ఫిలాసఫీయో అర్థంకావటం లేదు. ధర్మకర్తగా, ఆర్బిట్రేటర్‌గా వ్యవహరించాల్సిన కేంద్ర ప్రభుత్వం దిక్కుమాలిన మాటలు చెప్తోంది. ’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు అనుకూలంగా దేశంలోని 36 పార్టీలను ఏకం చేశామని ఆయన పేర్కొన్నారు. సీమాంధ్రకు చెందిన కవులు, మేధావులు కూడా తెలంగాణకు అనుకూలంగా ఉన్నారని చెప్పారు. మంచిమాటలతో తెలంగాణ ఇస్తే మంచిదన్నారు. లేదంటే ‘‘తెలంగాణ శాపం కాంగ్రెస్‌కు, సోనియాగాంధీకి పాపమై చుట్టుకుంటుంది. పామై కాటేస్తుంది’’ అని కేసీఆర్ హెచ్చరించారు.
సోనియాగాంధీ ప్రాణాలు ఎంత ముఖ్యమో తెలంగాణ యువత ప్రాణాలు కూడా అంతే ముఖ్యమన్నారు. సోనియాగాంధీ ఆరోగ్యం బాగుండాలని ఆకాంక్షించారు. ‘‘సోనియాగాంధీకి ఆరోగ్యం బాగాలేనందుకు ఆందోళనలను వాయిదా వేయాలని రోశయ్య అంటున్నాడు. సోనియాగాంధీ లేకుంటే పార్లమెంటు నడవటంలేదా? ప్రభుత్వం, ప్రధానమంత్రి లేరా? తెలంగాణ విషయానికి వస్తేనే అన్నీ అడ్డంవస్తాయా? తెలంగాణ ఉద్యమాన్ని ఆపంగాక ఆపం. మా పంథా మాకుంటుంది. తెలంగాణ వచ్చేదాకా ఆగేది లేదు. తుపాను, సునామీ సృష్టించి అయినా తెలంగాణ సాధిస్తా’’ అని ఆయన పేర్కొన్నారు. ‘‘ఓపిక, సహనం కోల్పోవాల్సిన అవసరం లేదు. ఫలితం వచ్చేదాకా, పట్టుదలతో కొట్లాడదాం. ఇప్పుడు కాకుంటే 2014లో దొరకరా? ఉద్యమంలో తత్తరపాటు బిత్తరపాటు వద్దు. మనకు ఇంకా సహనం పెరగాలి. తెలంగాణ విషయంలో తెలుపు, నలుపు తేలిపోయింది. దొంగలు ఎవరో, దొరలు ఎవరో తెలిసిపోయింది. మనకు కొట్లాడటానికి మార్గం ఇంకా సుగమం అయింది’’ అని చెప్పారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...