Thursday, August 18, 2011

జగన్ ఆస్తులపై ఏక బిగిన సోదాలు

సోదాలకు స్వయంగా హాజరైన సిబిఐ ఐజి లక్ష్మినారాయణ
హైదరాబాద్,అగస్ట్ 18:  హైకోర్టు ఆదేశాలపై  కేంద్ర నేర పరిశోధనా సంస్థ (సిబిఐ) గురువారం వైఎస్‌ఆర్ కాంగ్రెస్  అధ్యక్షుడు, కడప ఎంపి వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి చెందిన కంపెనీలు, ఆ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన పలు ఇతర కంపెనీలు, ఎమ్మార్ ప్రాపర్టీస్‌లో ఏక బిగిన సోదాలు నిర్వహించింది. నాంపల్లి సిబిఐ కోర్టు నుంచి బుధవారం అనుమతి రావడంతో గురువారం ఉదయమే సిబిఐ అధికారులు బృందాలుగా విడిపోయి దేశ వ్యాప్తంగా ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. హైదరాబాద్, బెంగళూరు, ముంబయి, చెన్నై, రాంచీ, కోల్‌కతాలో విస్తృతంగా సోదాలు నిర్వహించారు. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన సోదాలు రాత్రి వరకు కొనసాగాయి.  అధికారులు దాదాపు 15 బృందాలుగా విడిపోయి సోదాలు చేశారు. ఒక్కో బృందంలో 6 నుంచి 10 మంది ఉన్నారు. ఎమ్మార్ ప్రాపర్టీస్‌కు భారీ ఎత్తున భూములు కట్టబెట్టిన ఎపిఐఐసి అప్పటి మేనేజింగ్ డైరెక్టర్ బి.పి.ఆచార్య నివాసంలో కూడా సోదాలు నిర్వహించారు. సికిందరాబాద్ మహీంద్రాహిల్స్ లోని ధనలక్ష్మి కాలనీలో ఉన్న ఆచార్య నివాసంలో సోదాలు చేసి విలువైన డాక్యుమెంట్లు, కంప్యూటర్ హార్డ్  డిస్కులు  స్వాధీనం చేసుకున్నట్లు ఈ సోదాలకు నేతృత్వం వహించిన సిబిఐ డిఎస్‌పి ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఇదే సమయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కంపెనీలు, ఆయా యజమానుల నివాసాల్లోనూ తనిఖీలు కొనసాగాయి. సైనిక్‌పురిలోని మ్యాట్రిక్స్ కంపెనీ అధినేత నిమ్మగడ్డ ప్రసాద్ నివాసంలో సోదాలు నిర్వహించారు. నగరంలోని లోటస్‌పాండ్‌లో ఉన్న జగన్ నివాసం, సాగర్ సొసైటీలో ఉన్న జగన్ సోదరి షర్మిళ నివాసంలో సిబిఐ బృందం తనిఖీలు నిర్వహించింది.  బంజారాహిల్స్ రోడ్ నెం.12లో ఉన్న భారతి సిమెంట్స్, సాక్షి పత్రిక, చానెల్ కార్యాలయాలు ఉన్న ప్రధాన కాంప్లెక్స్లలో  విస్తృతంగా సోదాలు నిర్వహించారు. బెంగళూరులోని యలహంక, ముంబయిలో ఉన్న జగన్ నివాసాలను, సుండూరు పవర్ ప్రాజెక్టుల కార్యాలయాలను సోదాచేశారు. కూకట్‌పల్లిలోని మలేషియా టౌన్‌షిప్ వద్ద ఉన్న ఇందు ప్రాజెక్టును, వివేకానందనగర్‌లో ఉన్న దండమూడి వీరభద్రరావు నివాసాన్ని, గాయత్రి హిల్స్ లో ఉన్న హెట్రో గ్రూపు అధిపతి శ్రీనివాసరెడ్డి నివాసాన్ని సోదా చేశారు. సనత్‌నగర్‌లో ఉన్న హెట్రో ఫార్మా, ల్యాబ్స్, కార్యాలయాల్లో సిబిఐ అధికారులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేశారు. కడప జిల్లాలో ఉన్న భారతి సిమెంట్స్ కు చెందిన కార్యాలయాన్ని, ఆ కంపెనీకి లీజుకు ఇచ్చిన రెండు వేల ఎకరాల సున్నపురాయి భూముల లీజుల గురించి కూడా సిబిఐ ఆరా తీసింది. ఎమ్మార్ సిఇఓ రఘు, జగన్ కంపెనీల ఆడిటర్ సాయిరెడ్డి నివాసాల్లోనూ సోదాలు జరిగాయి. జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినట్లు ఆరోపణలు ఉన్న పయనీర్, సందేశ్ ల్యాబ్స్, దాల్మియా సిమెంట్స్, పివిపి వెంకట్, పెన్నా సిమెంట్స్, జూబ్లీ మీడియా, పులివెందుల ఫార్మా, ఇండియా సిమెంట్స్, కార్మెల్ ఏషియా, గిల్‌క్రిస్ట్ ఇమెంట్స్ తదితర కంపెనీల కార్యాలయాల్లో విస్తృత సోదాలు నిర్వహించారు. ఈ కంపెనీల్లో దొరికిన డాక్యుమెంట్లు, ఇతర సాక్ష్యాలను జాగ్రత్తగా కట్టుదిట్టమైన భద్రత మధ్య దిల్‌కుషా అతిథి గృహానికి చేర్చారు. చెన్నైలో ఉన్న పారిశ్రామిక వేత్త వసంత్ నివాసంలోనూ సోదాలు జరిగాయని తెలిసింది. లోటస్‌పాండ్‌లో ఉన్న జగన్ నివాసంలో జరిగిన సోదాల్లో సిబిఐ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణ స్వయంగా పాల్గొన్నారు. జగన్‌ను ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ మరో 50 మందితో కలిపి ఒక కేసు, ఎపిఐఐసి మాజీ అధికారి బిపి ఆచార్య, మరో అధికారి పార్థసారథిలను మొదటి, రెండవ నిందితులుగా పేర్కొంటూ మొత్తం 28 మంది ప్రభుత్వ అధికారులపై కేసులు నమోదు చేశారు. ప్రజాధనం దుర్వినియోగం కింద అధికారులు ఇద్దరితో కలిపి మిగిలిన వారిపై అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 13డి ప్రకారం కేసులు నమోదు చేసినట్లు సిబిఐ వర్గాలు పేర్కొన్నాయి. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...