Sunday, August 7, 2011

భారీగా తగ్గిన అమెరికా క్రెడిట్ రేటింగ్

వాషింగ్టన్,అగస్ట్ 7:  గతంలో ఎన్నడూ లేని విధంగా అమెరికా దీర్ఘకాలిక క్రెడిట్ రేటింగ్‌ను అత్యున్నత స్థాయి ‘ఏఏఏ’ నుంచి ‘ఏఏ+’ స్థాయికి కుదిస్తున్నట్లు అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ స్టాండర్డ్ అండ్ పూర్స్ ప్రకటించింది. దీనికి కూడా నెగటివ్ అంచనాలను జతచేసింది. పరిస్థితులు మెరుగుపడకపోతే మరో రెండేళ్లలో రేటింగ్‌ను ‘ఏఏ’ స్థాయికి కూడా తగ్గించే అవకాశాలున్నాయని పేర్కొంది. రుణ భారాన్ని తగ్గించుకునేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సంతృప్తికరమైన స్థాయిలో లేనందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్‌అండ్‌పీ వెల్లడించింది. ‘ట్రిపుల్ ఎ’ రేటింగ్ గల కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, యూకే వంటి దేశాల రుణాలు సమీప భవిష్యత్తులో తగ్గే అవకాశముం డగా, అమెరికా రుణ భారం మాత్రం మరింత పెరిగే ప్రమాదం కనిపిస్తోందని పేర్కొంది. మరోవైపు, అమెరికా రేటింగ్స్ కు కోతపెట్టినట్టు వార్తలు రాగానే.. ఆ దేశ ఆర్థిక విధానాలను చైనా తప్పుపట్టింది. తమ పెట్టుబడుల పరిరక్షణకు తగు చర్యలు తక్షణమే తీసుకోవాల్సిందిగా సూచించింది. అయితే, మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్, ఫిచ్ రేటింగ్స్ వంటి ఇతర క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు అమెరికా ‘ట్రిపుల్ ఎ’ రేటింగ్‌ను కొనసాగిస్తున్నట్లు తెలిపాయి. కానీ, రుణ భారం తగ్గించుకునేందుకు అమెరికా తగు చర్యలు తీసుకోలేకపోయినా.. వృద్ధిరేటు మరింత బలహీనపడినా డౌన్‌గ్రేడ్ చేసే అవకాశాలు ఉన్నాయని వెల్లడించాయి. తాజా పరిస్థితిపై అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా.. ఆర్థిక మంత్రి తిమోతీ గీత్నర్‌తో సమావేశమై సమీక్షించారు. రుణ చెల్లింపు సామర్థ్యాలపై సందేహాలు పెట్టుకోనక్కర్లేదని అమెరికా ప్రభుత్వం ఇన్వెస్టర్లకు భరోసా కల్పించే ప్రయత్నం చేసింది. రుణాలు తిరిగి చెల్లించలేక చేతులెత్తేసే పరిస్థితిలోకి వెళ్లిన అమెరికా ఈ మధ్యే తన రుణ సమీకరణ పరిమితిని పెంచుకుని గట్టెక్కిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అమెరికా రుణ భారం 14.57 లక్షల కోట్ల డాలర్లుగా ఉంది. బ్యాంకులు, పింఛను ఫండ్స్, విదేశీ ఇన్వెస్టర్లు ఈ రుణం ఇచ్చిన వారిలో ఉన్నారు. అమెరికా డెట్ మార్కెట్‌లో చైనా, జపాన్ అత్యధికంగా పెట్టుబడులు పెట్టాయి. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...