Saturday, August 13, 2011

14 (ఎఫ్) ఉఫ్...

న్యూఢిల్లీ, అగస్ట్ 13: ఎడతెగని వివాదానికి కేంద్రబిందువుగా నిలిచిన 14 (ఎఫ్) నిబంధన తెరమరుగైంది. శుక్రవారం రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ నిబంధన రద్దుకు ఆమోదముద్ర వేశారు. పోలీసు నియామకాలు, పదోన్నతుల విషయంలో ఇప్పటి దాకా ఫ్రీజోన్‌గా కొనసాగిన హైదరాబాద్ ఇక నుంచి ఆరో జోన్‌లో అంతర్భాగంగా మారింది. శని, ఆదివారాల్లో ఎస్‌ఐ రాత పరీక్షలున్న నేపథ్యంలో, వాటికి సరిగ్గా ఒక్క రోజు ముందు కేంద్రప్రభుత్వం హుటాహుటిన ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. 1975 నుంచి అమల్లో ఉన్న రాష్ట్రపతి ఉత్తర్వుల్లోని 14 (ఎఫ్)ను తొలగిస్తున్నట్టు శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. ఏపీ పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్ (ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ క్యాడర్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ డెరైక్ట్ రిక్రూట్‌మెంట్) ఆర్డర్-1975లోని 14 (ఎఫ్) క్లాజును తొలగిస్తూ రాష్ట్రపతి కార్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. అనంతరం ఫైలు కేంద్ర హోం శాఖకు చేరింది. 14 (ఎఫ్)ను తొలగిస్తున్నట్టు ఆ శాఖ వెంటనే గెజిట్ లో ప్రకటించింది. దాంతో ఎస్‌ఐ రాత పరీక్షలకు అడ్డంకులు దాదాపుగా తొలగిపోయాయి.  హైదరాబాద్ పోలీస్ చట్టం-1348 ప్రకారం 1975 అక్టోబర్ 18వ తేదీకి ముందు జరిపిన నియామకాలకు రాష్ట్రపతి ఉత్తర్వులలోని నిబంధనలు వర్తించకుండా రక్షణ కల్పించేందుకు 14(ఎఫ్)ను రాష్ట్రపతి ఉత్తర్వుల్లో చేర్చారు. వాటి ప్రకారం హైదరాబాద్‌లోని పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో జోన్లతో సంబంధంలేకుండా ఏ ప్రాంతీయులనైనా నియమించుకోవచ్చు. దాంతో రాజధాని ఫ్రీ జోన్‌గా మారింది. పోలీసు నియామకాలకు సంబంధించి హైదరాబాద్ ఫ్రీ జోనంటూ సుప్రీంకోర్టు 2008 అక్టోబర్ 9న తీర్పు ఇచ్చింది. దాంతో నగరాన్ని ఆరో జోన్లోనే ఉంచేలా చూడాలంటూ పార్టీలు, ప్రజా సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తూ వచ్చాయి.  హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ, మెదక్, నిజామాబాద్.జిల్లాలు అరో జోన్ లో వుంటాయి.  

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...