పోలవరంపై ' సుప్రిం' ఆదేశాలు

న్యూఢిల్లీ,నవంబర్ 18: పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంజూరు చేసిన తుది అనుమతుల అమలుపై స్టే కోరుతూ ఒడిశా ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై.. మూడువారాల్లోగా సమాధానమివ్వాలని సుప్రిం కోర్ట్ కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. స్టేతో పాటు యథాతథ స్థితి కొనసాగించాల్సిందిగా ఒడిశా ప్రభుత్వం తన పిటిషన్‌లో కోరింది. ఒడిశా పిటిషన్‌పై స్పందిం చాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూడా జస్టిస్ ముకుందకం శర్మ, జస్టిస్ అనిల్ ఆర్ దవేల ధర్మాసనం ఆదేశించింది. ఈ కేసులో సహ కక్షిదారుగా చేరుతామ న్న మహారాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని ధర్మాసనం అనుమతించింది. మరో కక్షిదారుగా అంగీకరించాలన్న కర్ణాటక విజ్ఞప్తిని మాత్రం తదుపరి విచారణలో పరిశీలిస్తామని పేర్కొంది. అటవీ, పర్యావరణ అనుమతులను ఎందుకు రద్దు చేయకూడదని ప్రశ్నిస్తూ.. ఆ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రాసిన లేఖకు సంబంధించిన నవంబరు 2 నాటి పత్రికల ప్రతులను ఒడిశా తరఫు న్యాయవాది కోర్టుకు సమర్పించారు. 8 వారాల తరువాత తదుపరి విచారణ జరుపుతామని ధర్మాసనం స్పష్టంచేసింది. సంబంధిత పార్టీలన్నీ మూడు వారాల్లోపు తమ వాదనలను కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. 2009లో అటవీ, పర్యావరణ శాఖ మంజూరు చేసిన సూత్రప్రాయ అనుమతులపై కోర్టులో విచారణ కొనసాగుతుండగా.. 2010 జూలైలో మళ్లీ తుది అనుమతులు మంజూరు చేయడాన్ని ఒడిశా ప్రభుత్వం తన పిటిషన్‌లో ప్రశ్నించింది. తుది అనుమతుల సమాచారాన్ని తమకు అందించకపోవడాన్ని కూడా ఆక్షేపించింది. పోలవరం ప్రాజెక్టు వల్ల తమ రాష్ట్రం ముంపునకు గురవుతుందని, ఇతర పర్యావరణ సమస్యలు కూడా తలెత్తుతాయని పేర్కొంది. 1980లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం.. బ్యాక్‌వాటర్ పరిధి 174. 22 అడుగులు, విడుదల సామర్ధ్యం 36 లక్షల క్యూసెక్కులని.. అయితే, అటవీ, పర్యావరణ శాఖకు చేసుకున్న దరఖాస్తులో ఏపీ ప్రభుత్వం బ్యాక్‌వాటర్ పరిథిని 182 అడుగుల పెంచుకోవడం ద్వారా ఆ ఒప్పంద ఉల్లంఘనకు పాల్పడిందని ఒడిశా ఆరోపించింది.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు