సీమను ముంచెత్తిన వర్షాలు

హైదరాబాద్,నవంబర్ 17: అల్పపీడన ప్రభావంతో గుంటూరు, చిత్తూరు, నెల్లూరు, వైఎస్‌ఆర్ కడప  జిల్లాల్లో పలుచోట్ల  భారీ వర్షాలు కురిశాయి. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తుండటంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.  జల చిక్కుకున్నాయి.  జలాశయాలకు నీటి ఉధృతి పెరుగుతోంది. ఇప్పటికే దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతులను ఈ వర్షాలు మరింత కలవరపాటుకు గురి చేస్తున్నాయి. వైఎస్‌ఆర్ కడప  జిల్లాలో కురుస్తున్న  వర్షాలకు పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కుందూ, సగిలేరు, పెన్నానదులు ఉధృతంగా పరవళ్లు తొక్కుతున్నాయి. జలాశయాలు నీటితో కళకళలాడుతున్నాయి. రాయచోటి నియోజకవర్గంలోని గాలివీడు మండలంలో వెలిగల్లు కుడి కాలువలకు 26వ కిలోమీటరు వద్ద పది మీటర్ల మేర గండి పడింది.  సోమశిల బ్యాక్ వాటర్‌కు తోడు సగిలేరు నీరుచేరడంతో కుంభగిరి-వేమలూరు మధ్యనున్న సగిలేరు లోలెవల్ బ్రిడ్జిపై మూడు అడుగుల మేర నీరు ప్రవహిస్తోంది. దీంతో దాదాపు 30 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. గుంటూరుజిల్లా నరసరావుపేట, సత్తెనపల్లి, వినుకొండ, గుంటూరు పట్టణాల్లో కుండపోత వర్షం కురిసింది.  గుంటూరు నగరంలోని లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లల్లోకి నీరు చేరింది. డ్రైన్‌లు పొంగడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చిత్తూరు జిల్లాలో పలు ప్రాంతాల్లో విడతలుగా వర్షం కురుస్తూనే ఉంది. దీంతో ముఖ్యంగా తూర్పు ప్రాంతంలో లోతట్టు ప్రాంతాల్లోని కాలనీలు, వరి నారుమళ్లు నీట మునిగాయి. ఐదు సంవత్సరాల తరువాత పీలేరు ప్రాంతంలోని పింఛా నది జలకళ సంతరించుకుంది. నగరి, సత్యవేడు నియోజకవర్గాల్లోని కుంటలు పొంగి ప్రవహిస్తున్నాయి. తిరుమల లోనూ వర్షం కురుస్తుండటంతో భక్తులు అసౌకర్యానికి గురయ్యారు.  శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. మేడికొండూరు(గుంటూరు): బతుకు  గుంటూరు రూరల్ మండలం మేడికొండూరు మండలం పేరేచర్ల గ్రామ సమీపంలో  పిడుగు పాటుకు ముగ్గురు  మృతిచెందారు. కాగా, నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర అల్పపీడనం పశ్చిమ దిశగా పయనించి బలహీనపడింది. ప్రస్తుతం ఇది అల్పపీడనంగా మారి ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్రలపై కేంద్రీకృతమై ఉంది. మరోవైపు ఈశాన్య రుతుపవనాలు దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలపై బలంగా ప్రభావం చూపుతున్నాయి. వీటి ఫలితంగా రానున్న 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమల్లో చాలాచోట్ల వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రం తెలిపింది.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు