విద్యార్ధుల దీక్ష భగ్నం : ముదురుతున్న ఎస్సై పోస్టుల వివాదం
హైదరాబాద్,నవంబర్ 17: ఎస్సై పోస్టులపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఉస్మానియాలో దీక్ష తలపెట్టిన ఆరుగురు విద్యార్ధులను పోలీసులు అరెస్టు చేసి గాంధీ ఆస్ప్త్రికి తరలించారు. ఎస్సై పోస్టుల వివాదంపై తెలంగాణా జిల్లాలో నిరసన జ్వాలలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. దీనిపై గురువారం తెలంగాణా జిల్లాలో నిరసన కార్యక్రమాలకు టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పిలుపు నిచ్చారు. కాగా, పోలీసుశాఖలో ఎస్‌ఐ పోస్టులకు రాత పరీక్ష నిర్వహించే అంశంపై ముఖ్యమంత్రి కె.రోశయ్య, హోంమంత్రి పి.సబితారెడ్డి బుధవారం రాత్రి సమీక్షించారు. ఈ అంశంపై మంగళవారం నాటి అఖిలపక్ష సమావేశం వివరాలను హోం మంత్రి సీఎంకు వివరించారు. ఫ్రీజోన్ వివాదం తేలేవరకు పరీక్ష నిర్వహించవద్దని ఉస్మానియా జేఏసీ నేతలు డిమాండ్ చేస్తున్నారని చెప్పారు. కాగా రాష్టప్రతి ఉత్తర్వులలోని 14(ఎఫ్)ను తొలగించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు అఖిలపక్షంతో ఢిల్లీకి వెళ్లే విషయంపై కూడా సమీక్షలో చర్చించారు. 2008లో విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఎస్‌ఐ పోస్టులకు రాత పరీక్ష నిర్వహించడం వల్ల ఎవరికీ అన్యాయం జరగబోదని, ఇప్పటికే ఎంపిక ప్రక్రియ సగం పూర్తయినందున అభ్యర్థులకు న్యాయం చేసేందుకే పోలీసుశాఖ ప్రయత్నిస్తోందని డీజీపీ అరవిందరావు ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ విషయంలో ఎలాంటి అనుమానాలున్నా 040-23232266కు ఫోన్‌చేసి పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా నివృత్తి చేసుకోవచ్చని సూచించారు. నేరుగా వచ్చినా అనుమానాలు నివృత్తి చేసేందుకు బోర్డు అధికారులు సిద్ధంగా ఉంటారని తెలిపారు. రాష్టప్రతి ఉత్తర్వుల నుంచి 14(ఎఫ్)ను తొలగించిన తరువాత హైదరాబాద్‌కు ప్రత్యేకంగా నియామకాలు జరుపుతామని డీజీపీ పునరుద్ఘాటించారు. తాజా సమాచారం ప్రకారం హైదరాబాద్‌లో 348 ఎస్‌ఐ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, 14(ఎఫ్)ను తొలగించేందుకు ప్రతిపాదనలు పంపినందున వాటిని భర్తీ చేయడంలేదని స్పష్టం చేశారు.
Comments