యడ్యూరప్పకు మళ్ళీ కష్ట కాలం
బెంగళూరు,నవంబర్ 17: : కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్పను మరో వివాదం చుట్టుకుంది. ముఖ్యమంత్రి కోటా కింద బెంగళూరు అభివృద్ధి ప్రాధికార (బీడీఏ) నివేశన స్థలాల కేటాయింపు, కర్ణాటక పారిశ్రామిక అభివృద్ధి మండలి (కేఐఏడీబీ) భూములను డీనోటిఫై చేయడం, ఆ భూములను పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టడంలో యడ్యూరప్ప అవినీతి, ఆశ్రీత పక్షపాతానికి పాల్పడ్డారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వివిధ భూ కేటాయింపుల్లో ముఖ్యమంత్రి కుమారులు, సోదరి, బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కేఎస్ ఈశ్వరప్ప లబ్ధిదారులు కావడంతో యడ్యూరప్ప రాష్ట్రంలోని విపక్షాల నుంచే కాక ఏఐసీసీ నుంచి కూడా దాడిని ఎదుర్కొంటున్నారు.భూ కేటాయింపులో యడ్యూరప్ప తన తనయులు, కుమార్తెకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయాలను దాఖలాలతో సహా ప్రతిపక్షాలు విడుదల చేశాయి. నగర శివార్లలోని జిగణి పారిశ్రామిక వాడ, తన సొంత జిల్లా శివమొగ్గలో యడ్యూరప్ప జరిపిన భూ కేటాయింపుల లావాదేవీలు అందులో ఉన్నాయి. ముంబైలోని ఆదర్శ హౌసింగ్ సొసైటీ, కామన్‌వెల్త్ గేమ్స్, 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణాల్లో పార్లమెంట్‌ను స్తంభింపజేస్తున్న బీజేపీకి కర్ణాటక పరిణామాలు మింగుడుపడటం లేదు. ఇక్కడి భూ కుంభకోణాల ఆధారంగా ఆ పార్టీని ఇరుకున పెట్టడానికి కాంగ్రెస్ ప్రయత్నాలను ముమ్మ రం చేసింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి మనీష్ తివారీ బుధవారం ఢిల్లీలో మీడియా తో మాట్లాడుతూ యడ్యూరప్ప తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
Comments