Monday, October 25, 2010

ఇండోనేషియాలో భారీభూకంపం: సునామీ ప్రమాదం లేదన్న అధికారులు

జకార్తా,అక్టోబర్ 25: ఇండోనేసియాలోని సుమత్రా దీవుల్లో సోమవారం భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.5గా నమోదైంది. భూకంపం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని తీర ప్రాంతాల్లో అలలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇండోనేసియా కాలమానం ప్రకారం రాత్రి 9.42 గంటలకు(భారత కాలమానం ప్రకారం రాత్రి 8.12 గంటలు) కెపులావువాన్ మెంటావాయ్ ప్రాంతం లో భూఉపరితలానికి 14.2 కిలోమీటర్ల లోతున భూకంపం సంభవించింది. దీంతో పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం స్థానికంగా సునామీ హెచ్చరిక జారీ చేసి, ఆ తర్వాత ఉపసంహరించింది. భూకంపం వల్ల ఎలాంటి నష్టం సంభవించినట్లు ఇంతవరకు సమాచారమేదీ వెలుగులోకి రాలేదు. అయితే దీనివల్ల భారత్‌కు, అండమాన్ నికోబార్ దీవులకు సునామీ వచ్చే అవకాశాలేవీ లేవని హైదరాబాద్‌లోని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (ఇన్‌కోసిస్) అధికారులు వెల్లడించారు. సునామీ రానున్నట్టు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని వారు చెప్పారు.




No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...