Saturday, October 30, 2010

వానల జోరు...రైతన్నల బేజారు...

హైదరాబాద్,అక్టోబర్ 30: రాష్ట్రంలో ఈశాన్య రుతుపవనాలు జోరందుకున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కూడా ఈ రుతుపవనాలకు తోడవడంతో గత రెండ్రోజులుగా కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మూడ్రోజుల నుంచి కురుస్తున్న కుండపోత వానతో శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా అతలాకుతలమవుతోంది. జిల్లాలో జనజీవనం పూర్తిగా స్తంభించింది. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పంటపొలాలు చెరువులను తలపిస్తున్నాయి. జిల్లాలో గోడ కూలి ఒకరు, చలిగాలులకు తట్టుకోలేక మరొకరు చనిపోయారు. నెల్లూరులో గడచిన 24 గంటల్లో రాష్ట్రంలోనే అత్యధికంగా 17 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రానున్న 48 గంటల్లో కోస్తాంధ్రలో పలుచోట్ల విస్తారంగా, కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు, తెలంగాణలో కొన్నిచోట్ల మోస్తరు వానలు కురవొచ్చని తెలిపింది. విశాఖపట్నం, విజయనగరం జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. కోస్తాలో ఆలస్యంగా వేసిన వరినాట్లు ప్రస్తుతం పొట్ట దశలో ఉన్నాయి. ఈ సమయంలో భారీగా వర్షాలు కురుస్తుండడంతో పంట తెగుళ్లబారిన పడుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలుచోట్ల కంకులు కట్టిన వరిచేలు నేలకొరిగాయి. కాయకొచ్చిన పత్తి పంట కూడా ఈ వర్షంతో కుళ్లిపోయే ప్రమాదముందని అధికారులు పేర్కొంటున్నారు. నెల్లూరు, కృష్ణా, చిత్తూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, విశాఖపట్నం, విజయనగరం, గుంటూరు, అనంతపురం, శ్రీకాకుళం జిల్లాలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...