Wednesday, October 20, 2010

రోశయ్య వర్సెస్ చంద్రబాబు

హైదరాబాద్,అక్టోబర్ 20: ముఖ్యమంత్రి రోశయ్య, తెలుగుదేశం అద్యక్షుడు చంద్రబాబు మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం జరిగింది. బతికి చెడినవాడివని సహించా అని రోశయ్య,నీలాంటి సీఎం.. ప్రజల దౌర్భాగ్యం అని బాబు అనే స్థాయి వరకు వారి మాటల యుద్ధం సాగింది. ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ రాష్ట్ర పర్యటనవిషయంలో బాబు చేసిన వ్యాఖ్యలపై రోశయ్య బుధవారం సచివాలయంలో విలేకరుల సమావేశంలో తనదైన శైలిలో వ్యంగ్యాస్ర్తాలతో విరుచుకుపడ్డారు. ప్రధానిని కలవాలనే చిత్తశుద్ధి బాబుకు లేనేలేదని, కేవలం పబ్లిక్ కోసం డ్రామా చేయడానికి మాత్రమే శ్రమ పడ్డారని ధ్వజమెత్తారు. ‘‘ప్రధానిని పట్టుకుని శాడిస్ట్ అంటావా? నీ స్థాయి ఏంటి? ఎవరు శాడిస్ట్?’’ అంటూ మండిపడ్డారు. ‘‘ఇంతకాలం బాబు నన్ను పనికి రానివాడన్నా, చేతకాని వాడన్నా... ఏదో నిరాశలో ఉన్నాడు, ఇంటా బయటా సమస్యల్లో చిక్కుకున్నాడు, ఆ బాధతో అంటున్నాడు లెమ్మని అర్థం చేసుకున్నాను. బతికి చెడిన వాడు, పూలమ్మాల్సిన వీధుల్లో కట్టెలమ్ముకునే స్థితిలో ఉన్నాడని సహిస్తూ వస్తున్నా. పాపం అనే భావనతో మాట్లాడకుండా ఉన్నా. నేను ఆయనంత క్వాలిఫైడ్ సీఎంను కాను. పరిస్థితుల వల్ల సీఎం అయ్యాను. నేను నూటికి నూరు శాతం అసమర్థ సీఎంనే. అధికారం కోసం ప్రాణాలు తీయడంలో, నమ్మిన వారిని ముంచడంలో, వెన్నుపోటు పొడవడంలో అసమర్థుడినే. పిల్లనిచ్చిన మామను ఎవరైనా తండ్రి తరువాత తండ్రిగా చూస్తారు. అలాంటి వ్యక్తిని అధికారం కోసం నిర్ధాక్షిణ్యంగా బాబు ఏం చేశాడో దేశ చరిత్రే చెబుతుంది. అసలే ఇబ్బందుల్లో ఉన్నాడు, ఎందుకు లెమ్మని కొద్ది నెలలుగా బాబును ఉపేక్షిస్తూ వస్తున్నా. కానీ ప్రధానినే శాడిస్ట్ అంటే ఊరుకుంటానా?’’ అంటూ నిప్పులు చెరిగారు. ‘‘నువ్వు అధికారంలో ఉండగా బిల్ గేట్స్, బిల్ క్లింటన్, టోనీ బ్లెయిర్‌లతో కలిసి చక్రం తిప్పుతున్నట్టు ప్రచారం చేసుకున్నావు. బిల్ క్లింటన్ తనకు ఫోన్ చేసినట్టు, ప్రపంచ రాజకీయాలు ఏమీ బాగా లేవు, మార్పు తేవాలి రమ్మని కోరితే తీరిక లేదని చెప్పినట్ట్టు ఉన్నవీ లేనివి ప్రచారం చేసుకుని, హైటెక్ సీఎం అని ముద్ర వేయించుకున్నావు. అలాంటి హైటెక్ సీఎంకు ఉండాల్సిన స్థాయి ఇదేనా?’’ అని ప్రశ్నించారు. ఇటీవలి కాలంలో బాబు తన స్థాయిని తానే దిగజార్చుకుంటున్నారని సీఎం అభిప్రాయపడ్డారు.ప్రతి ఒక్కరినీ విమర్శిస్తూ పోతుంటే తన ఔన్నత్యం పెరుగుతుందనే భ్రమల్లో ఉండి మాట్లాడుతున్నారని సానుభూతి వ్యక్తం చేశారు.

ఇక బాబు మరో విలేకరుల సమావేశంలో తొమ్మిదేళ్లు సీఎంగా పని చేశా. రోశయ్య సీఎం అయి ఏడాది కాలేదు, ఆయన కూడా నాకు ప్రొటోకాల్ గురించి చెబుతారా?’’ అంటూ మండిపడ్డారు. ‘రోశయ్య రాజకీయాల నుంచి రిటైరయ్యారు. ఆ తర్వాతే వైఎస్ ఆయనకు ఎమ్మెల్సీ పదవినిచ్చారు. ఇప్పుడు సీఎంగా జాక్‌పాట్ వచ్చింది. ప్రధాని మంచి ఆర్థికవేత్తే గానీ ప్రజల మనిషి కాదు. అందుకే ఎప్పుడూ ప్రత్యక్ష ఎన్నికలకు పోలేదు. సీఎం కూడా ప్రజల్లోకి వెళ్లడు. ఇలాంటి వారికి ప్రజా సమస్యలెలా తెలుస్తాయి’’ అని ఎద్దేవా చేశారు. ‘గతంలో చాలామంది సీఎంలను చూశాం. ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, వైఎస్ వంటివాళ్లనే ఎదుర్కొన్నాం. ఈ ముఖ్యమంత్రి బెదిరింపులు తమనేమీ చేయలేవు. ప్రభుత్వాన్ని విమర్శిస్తే మాకు పిచ్చి పట్టిందంటున్నారు. వీళ్లు చేసే ఘనకార్యాలకు పొగిడి సన్మానాలు చేయాలా?’ అంటూ ధ్వజమెత్తారు. ‘‘రోశయ్యలా నేనేమీ బ్లాక్‌మెయిల్ రాజకీయాలు చేయలేదు. ఎమ్మెల్యేల సహకారంతోనే సీఎం అయ్యాను. 155 మంది ఎమ్మెల్యేలు వ్యతిరేకించినా ఢిల్లీ నుంచి నామినేటై, మూణ్నెల్ల పాటు సీఎల్పీ ఆమోదం కూడా పొందని వ్యక్తి నా గురించి మాట్లాడటమా? మర్రి చెన్నారెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డిల హయాంలో రోశయ్య చేసిన రాజకీయాలు అందరికీ తెలుసు. ‘‘నేను ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నానని సీఎం అంటున్నాడు. విపక్ష నేతగా ఏం చేయాలో నాకో స్పష్టత ఉంది. ఇంటా బయటా ఒత్తిళ్లతో ఆయనే ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నాడు’’ అని బాబు విమర్శించారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...