Monday, October 18, 2010

కర్ణాటకంలో కొత్త మలుపు:కేసు కొత్త ధర్మాసనానికి బదిలీ

బెంగళూరు,అక్టోబర్ 18: కర్ణాటకం మరో మలుపు తిరిగింది. 11 మంది బీజేపీ ఎమ్మెల్యేల అనర్హతపై సోమవారం కర్ణాటక హైకోర్టు విభిన్నమైన తీర్పును వెలువరించింది. ధర్మాసనంలోని ఇద్దరు న్యాయమూర్తులు ఏకాభిప్రాయానికి రాకపోవడంతో విచారణను ఏకసభ్య ధర్మాసనానికి బదిలీ చేసింది. దీనిపై బుధవారం విచారణ జరగనుంది. ఐదుగురు స్వతంత్ర ఎమ్మెల్యేల అనర్హత కేసును కూడా మరో ధర్మాసనానికి బదిలీ చేసింది. దానిపై నవంబర్ 2న విచారణ జరుగుతుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్‌సింగ్, న్యాయమూర్తి ఎన్.కుమార్‌లతో కూడిన డివిజన్ బెంచ్ బీజేపీ ఎమ్మెల్యేల కేసులో ప్రధానంగా నాలుగు అంశాలపై విచారణ జరిపింది. స్పీకర్ నియమాలను పాటించారా, పిటిషనర్లకు సహజ న్యాయం లభించిందా, స్పీకర్ ఆదేశాల్లో దురుద్దేశాలేమైనా ఉన్నాయా అనే అంశాల్లో న్యాయమూర్తులు ఏకాభిప్రాయానికి వచ్చారు. స్పీకర్ అన్ని నియమాలూ పాటించారని అభిప్రాయపడ్డారు. నాలుగో అంశమైన ఎమ్మెల్యేల అనర్హతపై మాత్రం చెరో అభిప్రాయం వ్యక్తం చేశారు. జస్టిస్ ఖేహర్ స్పీకర్ ఆదేశాలను విస్పష్టంగా సమర్థించారు. ఎమ్మెల్యేల ప్రవర్తన ఫిరాయింపుల నిరోధక చట్టం కిందకు వస్తుందన్నారు. కనుక వారిని అనర్హులను చేయడం సబబేనని తేల్చి చెప్పారు. దీంతో జస్టిస్ కుమార్ విభేదించారు. ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రకటించారే తప్ప పార్టీపై కాదని అభిప్రాయపడ్డారు. కనుక స్పీకర్ ఆదేశాలను కొట్టేస్తూ తీర్పు వెలువరించారు. 1-1తో తీర్పు వెలువడినందున, కేసు విచారణను మూడో న్యాయమూర్తికి బదిలీ చేస్తున్నట్లు ప్రధాన న్యాయమూర్తి ప్రకటించారు. బుధవారం ఏకసభ్య ధర్మాసనం ముందు నాలుగో అంశంపై మాత్రమే విచారణ జరుగుతుంది. అనర్హత వేటుపడ్డ ఎమ్మెల్యేల రాజకీయ భవితవ్యం ఆ తీర్పుపై ఆధారపడి ఉంటుంది.బీజేపీ ఎమ్మెల్యేల అనర్హతపై తమలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనందున ఐదుగురు స్వతంత్ర ఎమ్మెల్యేల అనర్హత కేసును కూడా మరో ధర్మాసనానికి బదిలీ చేయాలని న్యాయమూర్తులు ఖేహర్‌సింగ్, కుమార్ నిర్ణయించారు. దాన్ని ద్విసభ్య ధర్మాసనానికి బదిలీ చేశారు. ముఖ్యమంత్రి యడ్యూరప్ప నాయకత్వంలోని ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నట్టు 11 మంది బీజేపీ ఎమ్మెల్యేలు, ఐదుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు గవర్నర్ హెచ్‌ఆర్ భరద్వాజ్‌కు ఈ నెల 6న లేఖ రాయడం, దాని ఆధారంగా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద స్పీకర్ కేజీ బోపయ్య 10న వారిపై అనర్హత వేటు వేయడం, దాన్ని సవాలు చేస్తూ వారంతా హైకోర్టును ఆశ్రయించడం, అక్టోబర్ 11, 14 తేదీల్లో ప్రభుత్వం రెండుసార్లు అసెంబ్లీలో విశ్వాస పరీక్షలో నెగ్గడం తెలిసిందే.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...