Thursday, October 28, 2010

ఒబామా భారత పర్యటన ఖరారు

వాషింగ్టన్,అక్టోబర్ 28: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత పర్యటన ఖరారైంది. నవంబర్ 6 నుంచి 9 వరకు ఒబామా సతీసమేతంగా భారత్‌లో పర్యటించనున్నారు. ఒబామా నవంబర్ 6న ముంబైలోని తాజ్ హోటల్‌లో 26/11 మృతులకు నివాళులు అర్పిస్తారు. అనంతరం ముంబై దాడుల బాధితులను ఉద్దేశించి మాట్లాడతారు. తర్వాత గాంధీ మ్యూజియంను సందర్శిస్తారు. అనంతరం అమెరికా-భారత్ వాణిజ్య మండలి ఆధ్వర్యంలో జరిగే సదస్సుకు హాజరవుతారు. రెండు దేశాల మధ్య ఆర్థిక సంబంధాల బలోపేతానికి వాణిజ్యపరంగా ఉన్న అవకాశాలపై ఈ సదస్సులో చర్చిస్తారు. ఇందులో ప్రసంగించే ముందు భారత్, అమెరికా వ్యాపారవేత్తలతో ఒకసారి, అమెరికా సీఈఓలతో మరోసారి రౌండ్‌టేబుల్ సమావేశంలో ఒబామా పాల్గొంటారు. ఆ రాత్రికి ముంబై తాజ్ హోటల్‌లోనే బసచేస్తారు. మరుసటి రోజు (నవంబర్ 7) ఉదయం స్థానికంగా ఉన్న ఓ పాఠశాలకు వెళ్లి చిన్నారులతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకొంటారు. తర్వాత కొంతమంది విశ్వవిద్యాలయం విద్యార్థులతో ముఖాముఖీలో పాల్గొంటారు. అమెరికా-భారత్ సంబంధాలపై వారితో మాట్లాడతారు. అదేరోజు సాయంత్రం ముంబై నుంచి ఢిల్లీ వెడతారు. అక్కడ హుమయూన్ టూంబ్స్‌ను సందర్శిస్తారు. ఆ రాత్రి ఒబామా, మిషెల్‌లు ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ దంపతులతో కలిసి ప్రైవేటు డిన్నర్‌కు హాజరవుతారు. నవంబర్ 8న రాజ్‌ఘాట్‌ను సందర్శించడంతో ఢిల్లీలో ఒబామా అధికారిక పర్యటన ప్రారంభమవుతుంది. తర్వాత ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో సమావేశమవుతారు. అది ముగిసిన తర్వాత విలేకరుల సమావేశంలో పాల్గొంటారు. అదేరోజు సాయంత్రం 5 గంటలకు భారత పార్లమెంటును ఉద్దేశించి ఒబామా ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమానికి మిషెల్ రాకపోవచ్చని సమాచారం. షెడ్యూల్ ప్రకారం 20 నిమిషాల్లోపే ఆయన తన ప్రసంగాన్ని ముగిస్తారు. అనంతరం రాష్టప్రతి ప్రతిభాపాటిల్‌తో భేటీ అవుతారు. తర్వాత ఒబామా తన గౌరవార్థం భారత ప్రభుత్వం ఇచ్చే విందుకు హాజరవుతారు. నవంబర్ 9న జకార్తా పర్యటనకు బయలుదేరతారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...