Saturday, October 30, 2010

తెలంగాణా వుద్యమాలు--నేపధ్యం

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని మూడు ప్రాంతాలలో తెలంగాణా ఒకటి, మిగతా రెండు కోస్తా ఆంధ్ర (లేదా ఆంధ్ర లేదా సర్కారు),  రాయలసీమ.. ఈ విభజన చారిత్రక కారణాల వల్ల వచ్చి భౌగోళిక, సాంస్కృతిక కారణాలతో అలాగే కొనసాగుతోంది. ప్రస్తుత తెలంగాణా ప్రాంతం నిజాం తన రాజ్యంలోని ప్రాంతాలను రక రకాల కారణాలతో బ్రిటీషువారికి ఇచ్చివేయగా మిగిలిన తెలుగు ప్రాంతము. ప్రస్తుతం తెలంగాణ ప్రాంతములో 10 జిల్లాలు వున్నాయి. భౌగోళికంగా ఇది దక్కను పీఠభూమిలో భాగము. దేశంలోనే పొడవైన 7వ నెంబరు, 9వ నెంబరు జాతీయ రహదారులు ఈ ప్రాంతము మీదుగా వెడుతున్నాయి. హైదరాబాదు-వాడి, సికింద్రాబాదు-కాజీపేట, సికింద్రాబాదు-విజయవాడ, సికింద్రాబాదు-డోన్, వికారాబాదు-పర్బని, కాజీపేట-బల్హర్షా రైలుమార్గాలు తెలంగాణ ప్రాంతం నుండి వెళ్తున్నాయి. సికింద్రాబాదు, కాజీపేట రైల్వే జంక్షన్లు దక్షిణ మధ్య రైల్వేలో ప్రముఖ కూడళ్ళుగా పేరెన్నికఅన్నాయి. తెలంగాణా కు దక్షిణమున ప్రధానముగా కృష్ణా, తుంగభద్ర నదులు ప్రవహిస్తుండగా, ఉత్తరమున గోదావరి నది ప్రవహిస్తున్నది. కృష్ణా, తుంగభద్ర నదులు దక్షిణాన తెలంగాణా , రాయలసీమ, ఆంధ్ర ప్రాంతాలను వేరుచేయుచండగా, ఆదిలాబాదు జిల్లా పూర్తిగాను, వరంగల్లు మరియు ఖమ్మం జిల్లాలలోని కొన్ని ప్రాంతాలు గోదావరికి ఉత్తరాన ఉన్నాయి. ప్రస్తుతం తెలంగాణాలో ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి, వరంగల్, కరీంనగర్, నిజామాబాదు, అదిలాబాదు, మెదక్ , హైదరాబాదు జిల్లాలు వున్నాయి. ఆదిలాబాదు జిల్లా ఉత్తరాన ఉండగా పశ్చిమ సరిహద్దులో ఆదిలాబాదుతో పాటు నిజామాబాదు, మెదక్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలు ఉన్నాయి. ఈశాన్య సరిహద్దులో కరీం నగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలున్నాయి. దక్షిణాన మహబూబ్ నగర్ జిల్లా, ఆగ్నేయాన నల్గొండ జిల్లా సరిహద్దుగా ఉంది. ఖమ్మం జిల్లా తెలంగాణకు అతితూర్పున ఉన్న జిల్లాగా పేరుగాంచింది. తెలంగాణ ప్రాంతపు సరిహద్దు లేని ఏకైక జిల్లా హైదరాబాదు. స్వాతంత్రానంతరం, వరంగల్లు నుండి కొంత ప్రాంతాన్నీ, గోదావరి జిల్లాలనుండి భద్రాచలం , దండకారణ్యం ప్రాంతాలను వేరు చేసి ఖమ్మం రాజధానిగా ఖమ్మం జిల్లాను ఏర్పరచినారు, ప్రస్తుతం ఖమ్మం జిల్లా మొత్తం తెలంగాణా ప్రాంతంలోని భాగంగానే వుంది. ఈ ప్రాంతం మూడవ శతాబ్దంలో శాతవాహనులు, తరువాత కాకతీయులు, తరువాత బహుమనీ సుల్తానులు, గోల్కొండ సుల్తానులు, మొఘలు పాదూషాలు, నిజాం సుల్తానులు పరిపాలించారు.భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చే నాటికి ఈ ప్రాంతం నిజాం పరిపాలనలోని హైదరాబాదు సంస్థానంలో భాగంగా ఉండేది. తరువాత తెలంగాణా పోలీసు చర్య ద్వారా ఇది స్వతంత్ర భారత గణతంత్ర రాజ్యంలో కలిసింది. ఈ పోరాటంలో తెలంగాణా సాయుధ పోరాటంనాటి రజాకార్ల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ముఖ్య భూమిక పోషించింది. తరువాత 1956లో భాషా ప్రాతిపదికపై రాష్ట్రాల పునర్విభజన ద్వారా అప్పటి మద్రాసు రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే వారితో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఆవిర్భవించింది. హైదరాబాదు రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రాంతాలన్నీ ఆంధ్రతో కలిపి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పరచినపుడు, తెలంగాణా ప్రాంతం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడాలన్న కోరిక ప్రజల్లో ఉండేది. అయితే అధిక సంఖ్యాక ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు సమైక్య రాష్ట్రానికి అనుకూలంగా ఉండటంతో ఇది సాధ్యపడలేదు. అయితే, తెలంగాణా సర్వతోముఖాభివృద్ధికి ప్రతిబంధకాలు ఏర్పడకుండా ఒక ఒప్పందం కుదుర్చుకున్న తరువాతే వారు సమైక్య ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటుకు సమ్మతించారు. తదనంతరం, ఈ ఒప్పందం సరిగా అమలు జరగడం లేదన్న అసంతృప్తితో విద్యార్ధులు, ఉద్యోగులు ఆందోళన వైపు పయనించారు. ఆ విధంగా 1969లో ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర వుద్యమం వచ్చింది.

                                                       (ఈ వుద్యమాలపై వ్యాసాలు త్వరలో)

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...