కామన్‌వెల్త్ క్రీడల్లో నూటొక్క పతకాలతో సత్తా చూపిన భారత్
న్యూడిల్లీ ,అక్టోబర్ 14: కామన్‌వెల్త్ క్రీడల ప్రారంభోత్సవాన్నే కాదు, ముగింపు ఉత్సవాలను కూడా భారత్ గురువారంనాడు ఘనంగా నిర్వహించింది. భారత క్రీడాకారులతో పాటు విదేశీ క్రీడాకారులు కూడా మనసారా ఆనందిస్తూ నృత్యాలు చేస్తూ ఆతిథ్య దేశమైన భారత్‌ను శ్లాఘించారు. పన్నెండు రోజుల క్రీడలకు గురువారం రాత్రి ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం తెర దించింది. కామన్‌వెల్త్ క్రీడల్లో నూటొక్క పతకాలతో భారత్ సత్తా చూపింది! భవిష్యత్తుపై ఆశలు సజీవంగా నిలిపింది! భారత పతకాల పట్టికలో 38 పసిడి పతకాలే. తెలుగు నేల కూడా తన వంతు పంట పండించింది. గగన్ నారంగ్, శరత్ కమల్, గుత్తా జ్వాల, పారుపల్లి కశ్యప్, సత్తి గీత, అబ్దుల్ ఖురేషీ... పతకవేటలో సహకారం అందించారు. రెండో స్థానంపై చివరి రోజు ఇంగ్లండ్ నుంచి ఎదురైన ముప్పును తప్పించిన తెలుగు తేజం సైనా నెహ్వాల్.. గోల్డెన్ ఫినిష్‌తో పట్టికలో భారత్‌కు ద్వితీయ స్థానం కట్టబెట్టింది! తొలుత అవినీతి ఆరోపణల సుడిగుండాల్లో ఎదురీదినా... నిర్వహణపై కమ్ముకున్న అనుమాన మేఘాల నడుమ ఉక్కిరిబిక్కిరైనా.. కామన్‌వెల్త్ క్రీడలు ఎట్టకేలకు గ్రాండ్ సక్సెస్ అయ్యాయి.ఆడంబరంగా సాగిన ఆరంభ వేడుకలను మరిపించేలా.. వీడ్కోలు సంబరం మురిపించింది. నాలుగేళ్ల తర్వాత స్కాట్‌లాండ్‌లోని గ్లాస్‌గోలో మళ్లీ కలుద్దామంటూ.. క్రీడాకారులు వీడ్కోలు తీసుకున్నారు.
Comments