
హైదరాబాద్,అక్టోబర్ 31: ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో పార్టీలన్నీ ప్రాంతాలవారీగా చీలిపోవడంతో ఒక విధమైన వుద్రిక్తత, ఉత్కంఠ నెలకొన్నాయి. తెలంగాణలోని వివిధ ప్రజా సంఘాలు వేడుకలను బహిష్కరించేందుకు సిద్ధమవుతుండగా సీమాంధ్ర మాత్రం రాష్ట్రావతరణ వేడుకలకు సర్వ సన్నద్ధమవుతోంది. తెలంగాణవాదుల నుంచి వ్యతిరేకత, నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈసారి నవంబర్ 1ని ఎలాగైనా ఘనంగా నిర్వహించేందుకు కోస్తా, రాయలసీమల్లో పార్టీలకతీతంగా అంతా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రం కోసం ఆమరణ దీక్ష చేసి అసువులు బాసిన పొట్టి శ్రీరాములు విగ్రహాలకు నిప్పంటించేందుకు ప్రయత్నించడం, ఆయన దిష్టిబొమ్మలను దగ్ధం చేయడం, వేడుకల్లో పాల్గొనే మంత్రు లపై దాడులు చేస్తామని తెలంగాణవాదులు హెచ్చరికలు చేయడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.హైదరాబాద్ తెలుగు వర్సిటీలోని అమరజీవి విగ్రహానికి నిప్పంటించేందుకు కొందరు ప్రయత్నించడం సీమాంధ్రలో ఆగ్రహావేశాలు రగిల్చింది. తెలంగాణ జిల్లాల్లో నవంబర్ 1న విద్యా సంస్థల బంద్‌కు ఉస్మానియా విద్యార్థుల జేఏసీ పిలుపునిచ్చింది. తరగతులు బహిష్కరించాలని విద్యార్థులను కోరింది. నవంబర్ 1ని విద్రోహదినంగా పాటించాలని విజ్ఞప్తి చేసింది. ఇలావుండగా హైదరాబాద్‌లో వారం రోజుల పాటు ఆంక్షలు విధించారు. అనుమతి లేకుండా సభలు, ధర్నాలు, ర్యాలీలు నిర్వహించరాదని నగ ర పోలీసు కమిషనర్ తెలిపారు. ఆంక్షలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కాగా,రాష్ర్ట అవతరణ దినోత్సవాలను అడ్డుకోవద్దని ముఖ్యమంత్రి కె.రోశయ్య కోరారు. రాష్ట్రం కలిసే ఉండాలా? విభజించాలా? అనే విషయం జస్టిస్ శ్రీకృష్ణ కమిటి పరిశీలనలో ఉందన్నారు. ఆ కమిటీ నివేదిక వచ్చేంతవరకు వేచి ఉందామని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన కోరుకునేవారి చర్యలు రెచ్చగొట్టేవిధంగా ఉండకూడదని హితవు పలికారు.
Comments