Tuesday, October 26, 2010

నివేదిక రూపకల్పనలో శ్రీకృష్ణ కమిటీ

న్యూఢిల్లీ,అక్టోబర్  26:  డిసెంబర్ 30 లేదా 31న తమ కమిటీ నివేదిక ఇచ్చి తీరుతుందని శ్రీకృష్ణ కమిటీ చైర్మన్ జస్టిస్ శ్రీకృష్ణ స్పష్టం చేశారు. ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో తమ అధికారిక కార్యాలయంలో కమిటీ సభ్యులు భేటీ అయ్యారు. ఈ సందర్బంగా.. నివేదిక ఎప్పుడు ఇస్తారని జస్టిస్ శ్రీకృష్ణను ప్రశ్నించగా.. ‘డిసెంబర్ 30 లేదా 31న ఇస్తామని.. అంతకుమించి మాట్లాడేందుకు ఏమీలేదు’ అని బదులిచ్చారు. ఆ తర్వాత కమిటీలో సామాజిక అంశాలను పరిశీలిస్తోన్న సభ్యురాలు రవీందర్‌కౌర్ విలేకరులతో మాట్లాడుతూ.. నిర్దేశిత గడువులోగానే నివేదికను ఇస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం సమాచార క్రోడీకరణ ప్రక్రియ చివరి దశలో ఉందని, డిసెంబర్ 31న నివేదిక ఇచ్చి తీరుతామని వెల్లడించారు. తమ నివేదికను భారత ప్రభుత్వానికి సమర్పించటంతో తమకు అప్పగించిన పని పూర్తవుతుందన్నారు. కమిటీ సభ్య కార్యదర్శి వి.కె.దుగ్గల్ మీడియాతో మాట్లాడుతూ సంతృప్తికర నివేదికను ఇచ్చేందుకు కమిటీ ప్రయత్నిస్తోందని చెప్పారు. ‘‘సంప్రదింపుల ప్రక్రియ అన్ని స్థాయిల్లో పూర్తిచేశాం. వివిధ అంశాలపై నిపుణులతో చర్చించాం. రాష్ట్ర స్థాయిలో దాదాపు వంద సంప్రదింపులు చేశాం. ఇందులో భాగంగా 17 జిల్లాల్లో, 35 గ్రామాల్లోనూ పూర్తిస్థాయి కమిటీ పర్యటించింది. ఇక మిగతా జిల్లాల్లో కమిటీ సభ్యులు క్షేత్రస్థాయి పర్యటనలు చేశారు. రాష్టవ్య్రాప్తంగా ఉన్న పరిస్థితులను లోతుగా అధ్యయనం చేశామని చెప్పగలం. రాష్ట్ర సామాజిక, ఆర్థిక, రాజకీయ భౌగోళిక రూపాన్ని పూర్తి స్థాయిలో అవగతం చేసుకున్నాం’’ అని దుగ్గల్ వివరించారు.  సామాన్యుడు అర్థం చేసుకొనే పరిభాషలోనే తమ నివేదిక ఉంటుందన్నారు. ఇప్పటివరకు గ్రామాల్లో కలిసిన వారిని మినహాయించి దాదాపు 1,200 మందిని కలిశామని దుగ్గల్ తెలిపారు. కమిటీ సందర్శించిన 35 గ్రామాల్లో.. గ్రామానికి 20 మంది చొప్పున 700 మందితో, 17 జిల్లాల్లో జిల్లాకు 25 మంది చొప్పున 400 మందితో మాట్లాడామని తెలిపారు.  

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...