కలిసొచ్చిన వర్షం...వండే సిరీస్ కైవశం
మార్గోవా,అక్టోబర్ 24: ఊహించినట్టే జరిగింది. భారత్, ఆస్ట్రేలియాల మధ్య ఆదివారం జరగాల్సిన ఆఖరి వన్డే వర్షం కారణంగా రద్దయింది. దీంతో మూడు వన్డేల సిరీస్ 1-0తో భారత్ వశమయింది. శనివారం రాత్రి కురిసిన భారీ
వర్షానికి జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియం చిత్తడిగా మారింది. రెండుసార్లు మైదానాన్ని పరిశీలించిన అంపైర్లు... మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. మైదానానికి వచ్చిన 27 వేల మంది ప్రేక్షకులు నిరాశగా ఇంటిముఖం పట్టారు. ఇరు జట్ల కెప్టెన్లు మినహా ఆటగాళ్లెవరూ స్టేడియానికే రాలేదు. పెద్ద ఆటగాళ్లు లేక కళతప్పిన వన్డే సిరీస్‌లో... మూడింటికి రెండు మ్యాచ్‌లు రద్దయ్యాయి. కొచ్చి, గోవా వన్డేలు రద్దుకాగా, విశాఖపట్నంలో జరిగిన మ్యాచ్‌లో భారత్ గెలిచింది. ఈ విజయంతో... 24 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాపై భారత్ స్వదేశంలో సిరీస్ సాధించినట్లయింది. ఇదే సమయంలో 30 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా జట్టు... భారత్ నుంచి ఒక్క విజయం కూడా లేకుండా వెనక్కు వెళుతోంది. రెండు టెస్టుల సిరీస్‌లో రెండు మ్యాచ్‌లనూ ఓడిన ఆసీస్... వన్డే సిరీస్‌నూ కోల్పోయింది.
Comments