చిలీ గని కార్మికులందరికీ విముక్తి
శాంటియాగో,అక్టోబర్ 14: చిలీ గనిలో 70 రోజులపాటు నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. పది వారాలపాటు గనిలో బిక్కుబిక్కుమంటూ గడిపిన కార్మికులను ప్రభుత్వం విజయవంతంగా బాహ్య ప్రపంచంలోకి తీసుకువచ్చింది. తద్వారా వారందరికీ స్వేచ్ఛావాయువులను అందించింది. దీంతో కార్మికులంతా గురువారం ఆనందోత్సాహాల్లో మునిగితేలారు. ప్రభుత్వ సహాయక చర్యల్లో భాగంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక క్యాప్సూల్ ద్వారా బుధవారం 17 మంది కార్మికులు బయటపడగా గురువారం మిగిలిన 16 మంది క్షేమంగా బయటకొచ్చారు. దేశాధ్యక్షుడు సెబాస్టియన్ పినెరా సమక్షంలో రెండురోజులపాటు కొనసాగిన ఈ ఆపరేషన్లో లూయిస్ ఉర్జువా అనే కార్మికుడు శ్రేయోభిలాషుల కరతాళధ్వనుల మధ్య జాతీయ పతాకాన్ని భుజాన కప్పుకొని చిట్టచివరగా క్యాప్సూల్ నుంచి బయటకు వచ్చాడు. అతన్ని కూడా పినెరా ఆప్యాయంగా ఆలింగనం చేసుకొని స్వాగతం పలికారు. దీంతో కార్మికులంతా ఒకరినొకరు ఆలింగనం చేసుకొని ఉద్విగ్న క్షణాలను పంచుకున్నారు. కార్మికులు తిరిగి స్వేచ్ఛా ప్రపంచంలోకి అడుగుపెట్టినందుకు సూచికగా 33 బెలూన్లను గాల్లోకి ఎగరేశారు. ఈ సహాయ చర్యలను విజయవంతంగా పూర్తి చేసినందుకు అమెరికా, ఫ్రాన్స్, బ్రెజిల్ అధ్యక్షులు ఒబామా, నికోలస్ సర్కోజీ, లూయిజ్ ఇనిసియో లూలా డీసిల్వాతోపాటు 16వ పోప్ బెనెడిక్ట్ చిలీ ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేశారు. చిలీ గని కార్మికుల వెలికితీతలో అమెరికన్ అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ గణనీయమైన సహాయ సహకారాలు అందించింది. అంతరిక్ష యానాల్లో సుదీర్ఘకాలం వ్యోమగాములు ఎదుర్కొనేటటువంటి పరిస్థితులే గనిలో చిక్కుకుపోయిన కార్మికులు ఎదుర్కొనడంతో ‘నాసా’ పరిజ్ఞానం వారిని సురక్షితంగా వెలికితీయడానికి ఉపయోగపడింది.
Comments