Friday, October 29, 2010

పరువునష్టం కేసులో టీవీ9 చానల్‌

ముంబై,అక్టోబర్ 29: టీవీ9 చానల్‌ను నిర్వహిస్తున్న అసోసియేటెడ్ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీ (ఏబీసీ)పై  భారీ పరువునష్టం కేసు దాఖలైంది.  టీవీ9 చానల్ తమ టౌన్‌షిప్ ప్రాజెక్టుకు సంబంధించి ప్రసారం చేస్తున్న వార్తలు తమ పరువుకు భంగం కలిగించేవిగా ఉన్నాయని, ఏబీసీ తమకు రూ. 304 కోట్ల పరిహారం చెల్లించాలని లావాసా కార్పొరేషన్ లిమిటెడ్ పుణేలోని ఓ కోర్టులో పరువునష్టం దావా వేసింది. దీన్ని పరిశీలించిన కోర్టు ఈ వార్తల ప్రసారాలను తాత్కాలికంగా నిలిపేయాలని ఈ నెల 27న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వీటిని ఎందుకు అమలు చేయరాదో వివరణ ఇవ్వాలంటూ ఏబీసీకి నోటీసునిచ్చింది. నవంబర్ 16లోగా దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.పుణే సమీపంలో తాము నిర్మిస్తున్న టౌన్‌షిప్‌పై టీవీ9 అభ్యంతరకర కథనాలను ప్రసారం చేసిందని లావాసా తన పిటిషన్‌లో ఆరోపించింది. ఆగస్టు 26 నుంచి సెప్టెంబర్ 1 వరకు సదరు చానల్ ఐదు కథనాలను ప్రసారం చేసిందని, అవి తమ పరువుకు భంగం కలిగించేలా ఉన్నాయని పేర్కొంది. రాజకీయ నేతల వాటాలు ఉండడం వల్లే మహారాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టుకు భూమిని మంజూరు చేసిందని ఆ కథనాల్లో తప్పుడుగా ప్రసారం చేసిందని పిటిషన్‌లో పేర్కొంది. ప్రాజెక్టు కోసం తాము 9,500 ఎకరాలను మార్కెట్ రేటు చొప్పున ప్రైవేటు వ్యక్తుల నుంచి కొనుగోలు చేశామని తెలిపింది. ప్రజల ప్రయోజనాల కోసం నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు పర్యాటక రంగానికి లాభాన్ని చేకూర్చడమేకాకుండా రాష్ట్ర రెవెన్యూ ఆదాయం పెరిగేందుకు కూడా దోహదపడుతుందని పేర్కొంది. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...