రెండో సారి 'పరీక్ష’లోనూ నెగ్గిన యడ్యూరప్ప : 18న హైకోర్టు తీర్పుకు లోబడే బలపరీక్ష ఫలితం

బెంగళూరు,అక్టోబర్ 14: కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప ‘రెండో పరీక్ష’లో నెగ్గారు. గురువారం శాసనసభలో జరిగిన విశ్వాస పరీక్షలో గెలుపొంది సర్కారును నిలబెట్టుకున్నారు. అయితే ఇది పూర్తి స్థాయి గెలుపేనా లేక మూన్నాళ్ల ముచ్చటేనా అన్న విషయం 18న హైకోర్టు ఇచ్చే తీర్పుపై ఆధారపడి ఉంటుంది. అసమ్మతి ఎమ్మెల్యేలపై స్పీకర్ వేసిన అనర్హత వేటు చెల్లుతుందా చెల్లదా అన్న అంశాన్ని హైకోర్టు తేల్చిచెప్పే వరకూ యడ్యూరప్పకు టెన్షన్ తప్పదు. అనర్హత చెల్లుతుందని కోర్టు ఆమోదిస్తే.. బీజేపీ సర్కారుకు ఇబ్బంది లేదు. ఒకవేళ చెల్లదని చెప్తే మాత్రం.. ముచ్చటగా ‘మూడో పరీక్ష’ను ఎదుర్కోవాల్సి రావచ్చు. గవర్నర్ హెచ్.ఆర్.భరద్వాజ్ సూచన మేరకు గురువారం ఏర్పాటు చేసిన శాసనసభ ప్రత్యేక సమావేశంలో యడ్యూరప్ప ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానానికి అనుకూలంగా 106, వ్యతిరేకంగా 100 ఓట్లు వచ్చాయి. స్పీకర్ కె.జి.బోపయ్య తొలుత మూజువాణి ఓటు ద్వారా విశ్వాస తీర్మానాన్ని ఆమోదిస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం ప్రతిపక్షాల విజ్ఞప్తి మేరకు ఓటింగ్ నిర్వహించారు. ప్రతి వరుసలోని శాసనసభ్యులు వంతుల వారీగా తమ స్థానాల వద్ద లేచి నిల్చోగా శాసనసభ సచివాలయం అధికారులు వారిని లెక్కించారు. అనంతరం 106-100 తేడాతో విశ్వాస తీర్మానాన్ని సభ ఆమోదించినట్లు స్పీకర్ ప్రకటించారు. ఐదుగురు స్వతంత్ర సభ్యులు సహా 16 మంది ఎమ్మెల్యేలు యడ్యూరప్ప సర్కారుపై అవిశ్వాసం వ్యక్తం చేయటంతో మైనారిటీలో పడ్డ యడ్యూరప్ప సర్కారు.. మొదటిసారి గత సోమవారం (11వ తేదీన) వివాదాస్పద రీతిలో విశ్వాస పరీక్షను గెలిచిన విషయం తెలిసిందే. 16 మంది అసమ్మతి ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేసి, మిగిలిన సభ్యులతో నిర్వహించిన సభలో మూజువాణి ఓటుతో విశ్వాస తీర్మానం ఆమోదం పొందినట్లు ప్రకటించిన విషయం విదితమే. ఆనాటి స్పీకర్ తీరు రాజ్యాంగ విరుద్ధంగా ఉందంటూ తప్పుపట్టిన గవర్నర్.. రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దుచేసి, రాష్టప్రతి పాలన విధించాల్సిందిగా కేంద్రానికి సిఫారసు చేశారు. అయితే, రాష్టప్రతి పాలన విధించటానికి కేంద్రం సానుకూలంగా లేకపోవటంతో.. మరోసారి బలపరీక్షను ఎదుర్కోవటానికి యడ్యూరప్పకు గవర్నర్ అవకాశం ఇచ్చారు. మరోవైపు.. తమపై అనర్హత వేటు వేయటాన్ని 16 మంది అసమ్మతి ఎమ్మెల్యేలు హైకోర్టులో సవాలు చేయగా ఆ కేసు విచారణను కోర్టు ఈ నెల 18కి వాయిదా వేసింది. కానీ.. గురువారం జరిగే విశ్వాసపరీక్ష ఫలితం తాను ఇవ్వబోయే తీర్పుకు లోబడి ఉంటుందని స్పష్టంచేసింది.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు