Saturday, October 30, 2010

ఏఐసీసీ భేటీకి రాష్ట్రం నుంచి 141 మంది: ఆహ్వానం అందని సురేఖ,మారెప్ప

హైదరాబాద్,అక్టోబర్ 30: నవంబర్ 2వ తేదీన ఢిల్లీలో జరిగే ఏఐసీసీ సమావేశాలకు హాజరు కావాల్సిందిగా రాష్ట్రం నుంచి 141 మంది ఏఐసీసీ సభ్యులకు ఆహ్వానం పంపారు. వాస్తవానికి రాష్ట్రంలో మొత్తం 158 (74 మంది కో-ఆప్టెడ్, నలుగురు ఎక్స్ అఫీషియో సభ్యులు కలిపి) ఏఐసీసీ సభ్యులున్నారు. వీరిలో డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి, కోనేరు రంగారావు, పర్వతనేని ఉపేంద్ర, ఎం.లక్ష్మీదేవమ్మ మరణించారు. మిగతా 13 మందిలో కేఎస్సార్ మూర్తి, చేగొండి హరిరామజోగయ్య, బి.వేదవ్యాస్, గొర్లె హరిబాబునాయుడు పార్టీ మారారు. రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న శాసస సభ స్పీకర్ ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి, శాసన మండలి చైర్మన్ చక్రపాణి, ఏపీపీఎస్సీ సభ్యురాలు జె.మల్లిక వంటి వారికి ఆహ్వానాలు పంపలేదు.
పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించారనే ఫిర్యాదుల నేపథ్యంలో ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ పరిశీలనలో ఉన్న వారికీ కూడా ఆహ్వానాలు పంపలేదు. మాజీ మంత్రి కొండా సురేఖ, మూలింటి మారెప్ప తదితరులు ఏఐసీసీ క్రమశిక్షణా కమిటీ పరిశీలనలో ఉన్నందునే వారిని ఆహ్వానించలేదని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కాగా, నవంబర్ 2న జరిగే ఏఐసీసీ సమావేశంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సభ్యుల ఎన్నికే ప్రధాన ఎజెండా. అయితే, సీడబ్ల్యూసీకి ఎన్నికలు జరిగే అవకాశమే లేదని తెలుస్తోంది. సీడబ్ల్యూసీ సభ్యులను నియమించే విశేషాధికారాలను పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి కట్టబెడుతూ సమావేశంలో తీర్మానం చేయనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. దీంతో ఈ సమావేశాల అనంతరం సోనియా అభీష్టం మేరకు సీడబ్ల్యూసీ సభ్యుల నియామకాన్ని చేపడతారు. ఒకవేళ ఎన్నికలు అనివార్యమైతే రాష్ట్రంలోని ఏఐసీసీ సభ్యులకు ఓటు హక్కు ఉండదు. రాష్ట్రంలో ఏఐసీసీ సభ్యుల ఎన్నిక జరగనందున వారికి ఓటు వేసే అవకాశం ఉండదు. ఇలావుండగా, పార్టీ మేలుకోసం మంత్రి పదవిని తృణప్రాయంగా వదులుకున్న తనకు ఆహ్వానం అందకపోవడంపై కొండా సురేఖ విస్మయం వ్యక్తం చేశారు. యూపీఏ చైర్‌పర్సన్, ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి ఆమె నాలుగు పేజీల సుదీర్ఘ లేఖ రాశారు. ప్రజాబలం లేని వృద్ధనేతలు తప్పుడు సలహాలిస్తున్నారని, వారిని నమ్ముకుంటే రాష్ట్రంలో పార్టీ నష్టపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.2014లో రాహుల్‌గాంధీని ప్రధానిగా చూసేందుకు రాష్ట్రంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీని భ్రష్టుపట్టిస్తున్న కేకే, కాకా, వీహెచ్, లగడపాటి, రాయపాటి, దగ్గుబాటి, కావూరి సాంబశివరావు లాంటి నాయకుల పేర్లు ఉంచి ఒక బీసీ మహిళనైన తనను ఆహ్వానించక పోవడంలోని ఆంతర్యం అర్థంకావడం లేదని ఆమె అన్నారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...