Monday, November 8, 2010

భారత్ తో అమెరికా సంబంధాల ప్రాధాన్యతను చేతల్లో చూపిస్తా: ఒబామా

న్యూఢిల్లి,నవంబర్ 8: ‘‘భారత్‌తో బంధం అమెరికాకు చాలా ముఖ్యం. ఈ విషయంలో నా మాటలను కాకుండా చేతలనే చూడండి’’ అని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు.ప్రధాని మన్మోహన్‌సింగ్, ఒబామా ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో పరస్పరం భేటీ అయ్యారు. భారత్-పాకిస్థాన్ సంబంధాలతో పాటు ద్వైపాక్షిక, ప్రపంచ స్థాయి అంశాలన్నింటిపైనా 75 నిమిషాల పాటు కూలంకషంగా చర్చించారు. అంతర్గత భద్రత (హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ)లో సహకారం, అమెరికా నిషేధిత జాబితా నుంచి భారత సంస్థల తొలగింపు, పౌర అణు రంగంలో భారత్‌లో పరిశోధన కేంద్రం స్థాపన... ఇలా కొత్త ఒప్పందాలు, చర్యలకు సంబంధించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. గతంలో కుదుర్చుకున్న పౌర అణు ఒప్పందం అమలు విధి విధానాలపై కూడా చర్చించారు. భేటీ అనంతరం ఒబామా, మన్మోహన్ సంయుక్తంగా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మూడు రోజుల భారత పర్యటన అధ్యక్ష పదవి చేపట్టాక తాను జరిపిన అత్యంత సుదీర్ఘ పర్యటన అని ఒబామా అనారు. ఉగ్రవాదులకు రక్షిత స్థావరాలు లేకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఈ ప్రాంతంలోని అన్ని దేశాలపైనా ఉందని పాక్‌నుద్దేశించి ఒబామా హితవు పలికారు. వర్తక, వ్యాపార, ఆర్థిక అవకాశాల అన్వేషణతో పాటు ఉగ్రవాదం, హింసాత్మక తీవ్రవాదం, అణ్వస్ర్తాల వ్యాప్తి వంటి సమస్యలను దీటుగా ఎదుర్కోవడంలో ఇరు దేశాలు ప్రధాన పాత్ర పోషిచాలని అన్నారు. ఈ దిశగా విమానాశ్రయాలు, సరిహద్దుల వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు ఇరు దేశాల హోం శాఖల మధ్య సహకారానికి సరికొత్త చర్యలు తీసుకుంటున్నా మని ఒబామా వివరించారు. ప్రధాని మాట్లాడుతూ, ‘‘భారత్ అమెరికా నుంచి అవకాశాలను తస్కరించే వ్యాపారమేమీ చేయడం లేదు. ఆర్థిక రంగంలో సహకారం ఇరుదేశాలకూ లాభకరమైన పరిస్థితికే దారి తీస్తుంది’’ అని స్పష్టం చేశారు. భారత్, పాకిస్తాన్ కోరితే కాశ్మీర్ సమస్య పరిష్కారం కోసం ఎలాంటి పాత్ర పోషించడానికైనా అమెరికా సిద్ధమని ఒబామా పునరుద్ఘాటించారు. దానిపై ప్రధానమంత్రి మన్మో హన్ సింగ్ స్పందిస్తూ.. చర్చలకు భారత్ ఏనాడూ వెనకడుగు వేయలేదన్నారు. బలమైన, శాంతియుతమైన, మితవాద పాకిస్థాన్ భారత్‌తో పాటు దక్షిణాసియాకు, ప్రపంచ ప్రయోజనాలకు కూడా మంచిదేనన్నారు. ఉగ్రవాదానికి పాక్ దూరమైతేనే ఆ దేశంతో అర్థవంతమైన చర్చలకు అవకాశముంటుందని తేల్చి చెప్పారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...